Begin typing your search above and press return to search.

దాస‌రి 'ఉద‌యం'.. అదో మ‌ర్చిపోలేని గ‌తం

By:  Tupaki Desk   |   31 May 2017 4:06 AM GMT
దాస‌రి ఉద‌యం.. అదో మ‌ర్చిపోలేని గ‌తం
X
ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి అన్న వెంట‌నే సినిమా వ్య‌క్తిగా మాత్ర‌మే చాలామందికి గుర్తుకు వ‌స్తారు. కానీ.. ఆయ‌న‌లోని కోణాలెన్నో. సినిమా రంగంలోనే కాదు.. రాజ‌కీయ రంగంలోనూ ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. అంతేనా.. పాత్రికేయ రంగంలోనూ ఆయ‌న సంచ‌ల‌నాలు సృష్టించారు. ఆయ‌న నేతృత్వంలో తెలుగు దిన‌ప‌త్రిక ఉద‌యం ప్రారంభించారు. తెలుగు దిన‌ప‌త్రిక రంగంలో ఉద‌యం ఒక సంచ‌ల‌నం.

తెలుగు ప‌త్రికా రంగంలో ఒక కొత్త ఒర‌వ‌డిని సృష్టించిన ఈ దిన‌ప‌త్రిక సృష్టించిన సంచ‌ల‌నాల‌కు మీడియా మొఘ‌ల్ గా పేరున్న ఈనాడు రామోజీరావుకు స‌వాలు విస‌ర‌ట‌మే కాదు.. ఒక ద‌శ‌లో చెమ‌ట‌లు ప‌ట్టించింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఆర్థిక‌ప‌ర‌మైన ఒడిదొడుకుల‌తో ఉద‌యం ప‌త్రిక‌ను నిలిపివేయాల్సి వ‌చ్చింద‌ని చెబుతారు. నిజానికి ఉద‌యం రావ‌టానికి ముందు వ‌ర‌కూ తెలుగు జ‌ర్న‌లిజంలో ఒక‌లాంటి స్త‌బ్దు వాతావ‌ర‌ణం ఉంద‌న్న మాట ఉంది. ఉద‌యం రావ‌టంతోనే ఒక కొత్త ఒర‌వ‌డి షురూ కావ‌ట‌మే కాదు.. ఈ దిన‌ప‌త్రి కోసం తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ కూడా వెయిట్ చేసిన సంద‌ర్భాలున్నాయ‌ని చెబుతున్నారు.

ఉద‌యం దిన‌ప‌త్రిక వ‌చ్చే ముందు వ‌ర‌కూ రామోజీ ఈనాడుదే అధిప‌త్యం. దాన్ని స‌వాలు చేస్తూ వ‌చ్చిన ఉద‌యం దిన‌ప‌త్రిక కోసం ప‌లు జిల్లాల్లో పాఠ‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే వారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో చేరేది. ఈనాడు లాంటి బ‌ల‌మైన దిన‌ప‌త్రిక ఉన్న‌ప్ప‌టికీ ఉద‌యం అంత‌గా సంచ‌ల‌నం సృష్టించ‌టానికి కార‌ణం ఏమిటి? తెలుగు ప్ర‌జ‌లు ఉద‌యంను ఎందుకంత‌గా ఆద‌రించి.. అభిమానించారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇంత‌కీ ఉద‌యంను అంత‌గా ఆద‌రించ‌టానికి కార‌ణం.. ఆ దిన‌ప‌త్రిక ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వ‌టమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఉద‌యం డైలీని 1984లో ప్రారంభించారు. తార‌క ప్ర‌భు ప‌బ్లికేష‌న్ త‌ర‌ఫున ప్ర‌చురించే వారు. ఉద‌యం దిన‌ప‌త్రిక‌కు ఛైర్మ‌న్ గా దాస‌రి నారాయ‌ణ‌రావు ఉండేవారు. ఎండీగా రామ‌కృష్ణ ప్ర‌సాద్ వ్య‌వ‌హ‌రించేవారు. ఇక‌.. ఏబీకే ప్ర‌సాద్ సంపాద‌క‌త్వంతో ప‌త్రిక బ‌య‌ట‌కు వ‌చ్చేది. ఏబీకే త‌ర్వాత ఉద‌యంను ప‌తంజ‌లి.. కె రామ‌చంద్ర‌మూర్తి సంపాద‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. 1991లో ఉద‌యంను ప్ర‌ముఖ రాజ‌కీయ నేత మాగుంట సుబ్బిరామిరెడ్డి కొనుగోలు చేశారు. ఉద‌యం దిన‌ప‌త్రిక పుణ్య‌మా యువ జ‌ర్న‌లిస్టులు పెద్ద ఎత్తున ఆ ప‌త్రిక‌లో చేరారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఉద‌యంలో ఎక్కువ‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన జ‌ర్న‌లిస్టులు ఉండేవారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివిన మొద‌టి త‌రం.. రెండో త‌రానికి చెందిన తెలుగు యువ‌కులు ఉద‌యంలో చేరారు. ఈ రోజున వివిధ మీడియా సంస్థ‌ల్లో ప్ర‌ముఖులుగా ఉన్న వారు.. ఉన్న‌త స్థానాల్లో ఉన్న వారిలో ప‌లువురి బ్యాక్ గ్రౌండ్‌లో ఉద‌యం క‌నిపిస్తుంది.

అలాంటి ప్ర‌ముఖుల్లో ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కుడు కె.శ్రీనివాస్ కావొచ్చు.. సాక్షి ప‌త్రిక ఎడిట‌ర్ వ‌ర్దెల్లి ముర‌ళీ.. సాహిత్య‌.. పాత్రికేయ రంగంలో సుప‌రిచితుడైన అంబ‌టి సురేంద్ర‌రాజు లాంటి వారితో పాటు స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ మాడ‌భూషి శ్రీధ‌ర్ లాంటి వారితో పాటు జ‌ర్న‌లిస్టులుగా ఒక ఇమేజ్ ఉన్న దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌.. పాశం యాద‌గిరిల వెనుక ఉద‌యం దిన‌ప‌త్రిక క‌నిపిస్తుంది. తెలంగాణ‌లో న‌క్స‌ల్ ఉద్యమం ప్ర‌బ‌లంగా ఉన్న వేళ వ‌చ్చిన ఉద‌యం.. అనేక సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నాల్ని ప్ర‌చురించింది. ప్ర‌జా ఉద్య‌మాల‌కు ద‌న్నుగా నిల‌వ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వాల‌కు స‌వాలు విస‌ర‌టంలోనూ ఉద‌యం ఒక సంచ‌ల‌నం. అందుకేనేమో ప్ర‌జ‌లు ఉద‌యాన్ని అంత‌గా అక్కున చేర్చుకున్నారు.

ప‌త్రిక ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన దాస‌రి ఎప్పుడూ కూడా ప‌త్రిక వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకునే వారే కాద‌ని చెబుతారు. అది మాత్ర‌మే రాయాలి.. ఇది రాయ‌కూడ‌ద‌న్న మాట ఆయ‌న నోటి వ‌చ్చేదే కాద‌ని చెబుతారు. జ‌ర్న‌లిస్టుల‌కు అస‌లుసిస‌లైన స్వేచ్ఛ ఉండేద‌ని.. వారికి ఫ్రీ హ్యాండ్ ఉండేద‌ని చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే ఉద‌యంలో వ‌చ్చిన క‌థ‌నాలు కూడా దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమిటంటే.. దాస‌రి ఇచ్చిన స్వేచ్ఛ‌ను జ‌ర్న‌లిస్టులు దుర్వినియోగం చేయ‌కుండా ఉద‌యం కీర్తిప్ర‌తిష్ట‌ల్ని పెంచేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నించేవారు. దీంతో ఉద‌యం అప్పుడో సంచ‌ల‌నంగా ఉండేది. ఏ రోజు ఏ క‌థ‌నం ప్ర‌చురిత‌మ‌వుతుందా? అన్న ప్ర‌శ్న అనునిత్యం పాఠ‌కులు ఆలోచించేలా చేసేది.

న‌క్స‌ల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న వేళ‌..పీపుల్స్ వార్ కేంద్ర క‌మిటీ కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య ఇంట‌ర్వ్యూను ఉద‌యం ప్ర‌చురించింది. ఈ ఇంట‌ర్వ్యూ అచ్చు కావ‌టానికి కార‌ణం.. జ‌ర్న‌లిస్టుల‌కు దాస‌రి ఇచ్చిన స్వేచ్చ‌గానే చెబుతారు.ఈ ఇంట‌ర్వ్యూ అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఉద‌యం త‌ర్వాత సినిమా రంగానికి సంబంధించిన వార్త‌ల కోసం శివ‌రంజ‌ని అనే ప‌త్రిక‌ను తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత ఉద‌యంపేరిట వీక్లీ కూడా తీసుకొచ్చారు. తెలుగు డైలీల‌లో క్రీడ‌ల‌కుఒక పేజీ కేటాయించ‌టం ఉద‌యంతోనే మొద‌లైంది. ఒక్కో రంగానికి ఒక్కో పేజీ కేటాయించాల‌న్న విధానాన్ని ఉద‌య‌మే మొద‌లు పెట్టిన‌ట్లుగా చెబుతారు. త‌ర్వాతి కాలంలో ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాల‌తో కుంగినా.. ఉద‌యం మాత్రం తెలుగు ప్ర‌జ‌ల‌కు మ‌ర్చిపోలేని ఒక గ‌తంగా చెబుతారు.దాస‌రి అస్త‌మించిన‌వేళ‌.. ఉద‌యం ప్ర‌స్తావ‌న అవ‌స‌రం. ఏదో ఒక‌రోజు దాస‌రి స్వ‌ప్న‌మైన ఉద‌యం మ‌ళ్లీ ఉద‌యించ‌క మాన‌ద‌న్న ఆశ‌ను ఇప్ప‌టికే ప‌లువురుపాత్రికేయులు వ్య‌క్తం చేస్తుంటారు. దివికేగిన దాస‌రి.. ఉద‌యంను మ‌ళ్లీ ఉద‌యించేలా ఆశీర్వ‌దిస్తారేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/