Begin typing your search above and press return to search.
కాపుల విషయంలో దాసరి ఫైట్ మరువలేనిది
By: Tupaki Desk | 31 May 2017 1:33 PM GMTదర్శకరత్న దాసరి నారాయణరావు మరణం ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో ఒకటిగా నిలువనుందని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి పరిణామాల్లో కీలకమైన కాపు రిజర్వేషన్ల విషయంలో దాసరి పోషించిన కీలక పాత్ర ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఉద్యమకారుడిగా ఉన్న కాపు రిజర్వేషన్ల నేత ముద్రగడ పద్మనాభం కార్యాచరణకు మద్దతు ఇవ్వడం, రాజకీయాల పరంగా భిన్నధ్రువాలైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - కాంగ్రెస్ నేత - ఎంపీ అయిన చిరంజీవిని సైతం ప్రత్యేక కారణం కోసం ఒక్కతాటిపైకి తీసుకురావడం దాసరి ఒక్కరికే సాధ్యమైందని అంటున్నారు.
2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాపులకు రిజర్వేషన్లు హామీని నిలుపుకోవడంలో విఫలమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై గళమెత్తిన కాపువర్గాలకు దాసరి నారాయణ రావు అండగా నిలిచారు. కాపు ఉద్యమనేత ముద్రగడను అరెస్టు చేసి రాజమండ్రి ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై దాసరి ఘాటుగా రియాక్టయ్యారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాకుండా తన స్వగృహంలోనే కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి కాపుల పోరాటానికి తన సంఘీభావంలోని చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇదే సమయంలో భిన్న ధ్రువాలతో కూడా దాసరి కలిసి పనిచేశారు.
అప్పటివరకు పలు కారణాలతో ఒకింత గ్యాప్ ఉన్న మెగాస్టార్ చిరంజీవితో కూడా దాసరి చేయికలిపారు. కాపుల కోటా విషయంలో కలిసి ఉద్యమించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా తగు రీతిలో పర్యటనలు, కార్యాచరణలు కూడా చేశారు. ఇక కాపుల పోరాటం విషయంలో క్రియాశీలంగా ఉన్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్‌తో కూడా కాపు ఉద్యమానికి మద్దతు ఇప్పించడంలో దాసరి క్రియాశీలంగా వ్యవహరించారు. ఒకదశలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు దాసరి అడుగు వేసినట్లు వార్తలు వచ్చాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/