Begin typing your search above and press return to search.

ఏపీలో దాసరి కొత్త పార్టీ

By:  Tupaki Desk   |   9 April 2016 4:05 PM IST
ఏపీలో దాసరి కొత్త పార్టీ
X
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీలూ కాపుల ఓట్ల కోసం వెంపర్లాడుతున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలే ఏకతాటిపైకి వచ్చి పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి వేదికగా ఈ పార్టీ ఏర్పడుతుందని అంటున్నారు.

మాజీ కేంద్ర మంత్రి - కాపుల్లో మంచి కమాండ్ ఉన్న దాసరి నారాయణ రావు నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దాసరికి సినీరంగంలోనూ వర్గం ఉండడంతో ఆ రంగంలోని కాపు ప్రముఖులు - ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఈ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్నప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు మొదలవడంతో వచ్చే ఎన్నికల నాటికి వారిలో చాలామందికి సీట్లు రాక అసంతృప్తి చెందుతారని... మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక అలాంటి నేతలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తారని భావిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండకపోవచ్చని.... ఆ సమయంలో ఏపీలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ నేతలు కాపు పార్టీతో కలిసి సాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో వైసీపీ - టీడీపీ - బీజేపీ ఓట్లు దేనికవి విడిపోయి కాపుల పార్టీకి ప్రయోజనం కలగొచ్చని లెక్కలేస్తున్నారు.

ఇంకో విషయం ఏంటంటే ఏపీలోని 13 జిల్లాల్లో కాపు సామాజికవర్గం 13 శాతం ఉండగా.. రెడ్లు - చౌదరిలు పది శాతం లోపే ఉన్నారు. పైగా కాపు వర్గం తమకంటూ రాజకీయంగా ఎదుగుదల అవసరమని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పార్టీలో - ఓటింగులో ఒకేమాటపై ఉంటారని అనుకుంటున్నారు. పనిలోపనిగా బీసీలను తమవైపు కొంత మేర తిప్పుకోగలిగితే అధికారం వరకు వెళ్లొచ్చని అంచనాలు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కొందరు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది.