Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో తిరుగుబాటు

By:  Tupaki Desk   |   5 Oct 2016 6:57 AM GMT
ఏపీ బీజేపీలో తిరుగుబాటు
X
సుదీర్ఘ కాలం నిరీక్షణ తరువాత ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టిన నామినేటెడ్ పదవుల జాతర టీడీపీలో సందడి కలిగిస్తున్నా మిత్రపక్షం బీజేపీలో మాత్రం అలజడి రేపింది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పే బీజేపీలో ఈ పదవుల గోల గందరగోళం సృష్టిస్తోంది. చివరకు పార్టీ నాయకత్వాన్నే ధిక్కరించే స్థాయికి అంతర్గత యుద్ధాలు తీవ్రమవుతున్నాయి.

రెండు రోజుల కిందట పదవులపై రేగిన గొడవ నేపథ్యంలో విజయవాడ బీజేపీ కార్యాలయంపై కార్యకర్తలు జరిపిన దాడి వెనక ఆ పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు పాత్ర ఉందని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దాసంను సస్పెండ్ చేశారు. అయితే.. దాసం ఏమాత్రం తగ్గకుండా వెంటనే పార్టీ కార్యాలయంలోనే వివిధ డివిజన్‌ ల అధ్యక్షులు - పలువురు ఇతర నేతలతో సమావేశమయ్యారు. సస్పెన్షన్‌ ను వ్యతిరేకిస్తూ దాసంనే అధ్యక్షునిగా కొనసాగింపజేస్తూ ఆ సమావేశంలో తీర్మానం చేశారు. అంతేకాదు... ఆ తీర్మానాలను పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షాకు పంపించాలని కూడా నిర్ణయించారు. ఇదంతా ఒకెత్తయితే.. సమావేశం సందర్భంగా సస్పెండయిన నేత దాసం మాట్లాడుతూ... తనను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటికి లేదని కుండ బద్ధలు కొట్టేశారు. అందుకు లాజిక్ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కంభంపాటి పదవీకాలం ముగిసిందని.. ఎన్నికలు జరిపించకుండా అడ్డగోలుగా కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

దీంతో బీజేపీలో కంభంపాటికి ఎదురుగాలి వీస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దికాలంగా సోము వీర్రాజు వర్గం హరిబాబును వ్యతిరేకిస్తూ వస్తోంది. హరిబాబు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. అయితే.. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారాలు ఇప్పుడు వీధికెక్కాయి. మరి... దీనిపై ఆ పార్టీ అధినాయకత్వం ఏమంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/