Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుది నియంత పాల‌నేనా?

By:  Tupaki Desk   |   26 Aug 2017 8:45 AM GMT
చంద్ర‌బాబుది నియంత పాల‌నేనా?
X
కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అధికార ప‌క్షంపై ఆధారాల‌తో స‌హా విప‌క్షం వైసీపీ విరుచుకుప‌డుతోంది. ఏ ముఖం పెట్టుకుని కాకినాడ కార్పొరేష‌న్‌ లో ఓట్లు అడుగుతార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. బాబు స‌ర్కారును ఓరేంజ్‌ లో ఏకిపారేశారు. బాబుదంతా చీక‌టి పాల‌నేన‌ని, దొంగ జీవోల‌తోనే ప‌బ్బం గ‌డుపుతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా ఈ మూడేళ్ల‌లో దాదాపు 1500 ర‌హ‌స్య జీవోల‌ను విడుద‌ల చేసి.. చీక‌టి పాల‌న‌కు తెర‌దీశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అత్యంత కీల‌క విష‌యాలు అయిన‌ప్పుడు మాత్ర‌మే అది కూడా నాలుగే లేదా ఐదు సార్లు .. ఇలా ర‌హ‌స్య జీవోలు విడుద‌ల చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని, కానీ, బాబు మాత్రం.. త‌న‌దంతా నిజాయితీ పాల‌న అని చెప్పుకొంటూనే ఇలా దొడ్డి దారిలో దొంగ‌పాల‌న సాగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, కాకినాడ కార్పొరేష‌న్‌ పై మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్నిక‌ల హామీల స‌మ‌యంలో కాకినాడ‌కు ఎన్నో హామీలు ఇచ్చింద‌న్నారు. పోర్టులో అత్యాధునిక సౌక‌ర్యాలు స‌హా.. కాకినాడ‌కు వ‌ర్సిటీ తెస్తామ‌ని ఇచ్చిన హామీ ఏమై పోయింద‌ని ప్ర‌శ్నించారు.

రాజ్యాంగ వ్యవస్థలకు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని దుయ్య‌బ‌ట్టారు. స్పీకర్‌ వ్యవస్థను అపఖ్యాతి పాలు చేశార‌ని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు చర్యలు లేద‌ని విమ‌ర్శించారు. శివరామకృష్ణ కమిటీ వద్దన్న అంశాలనే అమలు చేసి... చంద్ర‌బాబు త‌న మొండి మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నార‌ని అన్నారు. ప్రజా సంఘాలు, మేధావులు, పౌరుల అభిప్రాయాలను తీసుకోలేదని, రాజధాని వ్యవహారం చంద్రబాబు కుటుంబ వ్యవహారమా? అని ప్ర‌శ్నించారు.

టీడీపీ ప్రభుత్వం ఏడాదిన్నర మాత్రమే ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమ‌ని చెప్పారు. కాకినాడ వాసుల చిరకాల కోరికలను వైసీపీ నెరవేరుస్తుందని ధ‌ర్మాన హామీ ఇచ్చారు. టీడీపీని మిత్రపక్షమైన బీజేపీనే నమ్మడం లేదని, అందుకే చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ధర్మాన ఎద్దేవా చేయ‌డం గ‌మ‌నార్హం. కాకినాడ పౌరులు చైత‌న్యం చూపించాల‌ని ధ‌ర్మాన పిలుపునిచ్చారు. మొత్తానికి బాబుపై ధ‌ర్మాన ఓ రేంజ్‌లో ఎక్కేశారు.