Begin typing your search above and press return to search.

వైకాపాలో ఆ ఇద్దరిదీ వేర్పాటువాద బాటేనా?

By:  Tupaki Desk   |   2 Nov 2015 10:30 PM GMT
వైకాపాలో ఆ ఇద్దరిదీ వేర్పాటువాద బాటేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి మూడు ముక్కలాట గా మారేలా కనిపిస్తోంది. తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న నాటినుంచి ఇలాంటి భయాలు కొందరిలో ఉన్నాయి. కానీ మరీ అంత వికృతమైన పరిస్థితులు ఎందుకు దాపురిస్తాయిలే అని తమను తాము ఊరడించుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులను, నాయకుల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తులను, వారి మాటలను గమనిస్తోంటే.. మూడుముక్కలాట తప్పదని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ను మూడు రాష్ట్రాలుగా చేయాలనే డిమాండ్‌ లు తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి మొత్తం అమరావతి మీద పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌ కు అంతర్జాతీయ స్థాయి రాజధానిని అందించాలనేదే ఆయన దృక్పథంలో ఉంది తప్ప మరొకటి ఆనడం లేదు. అయితే మొత్తం అభివృద్ధి ప్రభుత్వం సంస్థలు సమస్తం అక్కడే కేంద్రీకృతం అయిపోతున్నాయనే బాధ రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల్లో ఉంది.

తెలుగుదేశం నాయకులు ఎటూ తమ మనోభావాలు బయటపెట్టరు గనుక.. పట్టించుకోనక్కరలేదు. అయితే వైకాపా నాయకులు మాత్రం భయాల్ని దాచుకోవడం లేదు. కొన్ని రోజుల కిందట అమరావతి మీద ఉన్న ఫోకస్‌ ను ప్రస్తావిస్తూ సీమకు చెందిన మైసూరారెడ్డి.. సీమ ప్రాంతంలో వేర్పాటువాదం ప్రబలే అవకాశం ఉన్నదని భయం వ్యక్తం చేశారు.

ఇవాళ సరిగ్గా అలాంటి మాటే ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా నాయకుడు ధర్మాన ప్రసాదరావు నోటినుంచి వచ్చింది. అన్ని ప్రభుత్వ సంస్థలను ఒకే చోట కేంద్రీకరించేయడం ఏమాత్రం మంచి పద్దతి కాదని.. దీనివల్ల వేర్పాటు వాదం ముదిరే ప్రమాదం ఉన్నదని ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. అంటే.. ఉత్తరాంధ్ర వాసుల్లో కూడా తమకో ప్రత్యేకరాష్ట్రం వచ్చేస్తే బాగుండు! ఇక అమరావతి పేరిట ఎలా తగలేసుకున్నా మనకు అక్కర్లేదు అనే వెరపు కలుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు కీలక నాయకులు మైసూరా, ధర్మానలు వేర్పాటు వాదం గురించి మాట్లాడడం రాష్ట్రం మూడుముక్కలాట కావడానికి శ్రీకారం అవుతుందేమో అనిపిస్తోంది.