Begin typing your search above and press return to search.

డబ్బుంటే సంతోషాన్ని కూడా కొనేయచ్చండీ...!

By:  Tupaki Desk   |   14 March 2023 9:12 AM GMT
డబ్బుంటే సంతోషాన్ని కూడా కొనేయచ్చండీ...!
X
డబ్బు ఉంటేనే అన్నీ అని మరోసారి రుజువు చేసే ముచ్చట ఇది. సంతోషం మార్కెట్ లో దొరుకుతుందా అంటే డబ్బు చేతిలో ఉంటే కచ్చితంగా దొరుకుతుంది అని అంటోంది ఒక అధ్యయనం. డబ్బు లేని వాడి గుండె నిండా బాధలతో పీచుపీచుమంటే డబ్బున్న వాడి హృదయం నీలి మబ్బులను తాకుతూ హుషార్ చేస్తుంది. మరి డబ్బులో లేనిది ఏముంది అంటే జవాబు సులువేగా.

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. ఆ సంతోషం ఎక్కడ నుంచి వస్తుంది అంటే డబ్బు నుంచేనట. డౌట్ ఏమైనా ఉంటే దిగ్గజ ఆర్ధికవేత్త నోబుల్ గ్రహీత డేనియల్ కహ్నేమాన్ దీని మీద విశేషమైన పరిశోధన చేసి మరీ పూర్తి క్లారిటీ అయితే సమస్త లోకానికీ ఇచ్చేశారు. సంతోషం ఎక్కడా లేదురా అబ్బాయ్.. నీ జేబులోని కరెన్సీలో ఉంది అని గొప్ప సత్యాన్ని ఆయన చాటారు.

లబ్బు డబ్బు అని గుండె అనడం వెనక మర్మం మంత్రం అదే అని కూడా విడమరచి చెప్పేశారు. డబ్బు ఎంత ఉన్నా ఆనందం ఎక్కడ నుంచి కొనుగోలు చేయగలం అన్న వారి మాటలు వట్టి చేతగాని మాటలుగా ఈ పరిశోధనను చూస్తే అనిపించకమానదు. ఇందకీ డేనియల్ కహ్నేమాన్ చేసిన పరిశోధన లోని సారం ఏంటి అంటే ఆదాయం ఎంత పెరిగితే అంతగా సంతోషం పెరుగుతుందని. ఇది రుజువు అయిన నిక్షార్సు అయిన నిజం అని ఆయన గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు.

ఆయన దీని మీద ఏకంగా అద్భుతమైన స్టడీ కూడా చేశారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గలిగిన అమెరికన్ల మీద ఆయన ఈ పరిశోధన చేపడితే ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయట. అందులో చాలా మంది అవును డబ్బుంటే ఫుల్ హ్యాపీ అని చెప్పేరని అంటున్నారు. ఇలా ఆయన 33,391 మంది వరకూ ఉన్న అమెరికన్ల మీద పరిశోధన చేపడితే అందులో మెజారిటీ ధనమేరా అన్నింటికీ మూలం అని గొప్ప తాత్విక చింతనంతో అసలు గుట్టు చెప్పారట.

అంటే వారందరికీ డబ్బుంటే చాలు ఎక్కడ ఏమైనా వెతుక్కోవచ్చు అన్న ఆర్ధిక నీతిసూత్రం వంటబట్టిందని డేనియల్ చెబుతున్నారుట. అయితే ఇందులో కూడా ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే అమెరికన్లు ఏడాదికి మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఏడాదికి నాలుగు కోట్ల పై చిలుకు ఆదాయం సంపాదిస్తున్నా బాధలు తమను వీడిపోవడం లేదని సంతోషం అన్న మాట తాము ఎరగమని చెప్పిన వారూ ఉన్నారట.

ఈ సంఖ్య మొత్తం అధ్యయనం చేసిన వారిలో పదిహేను శాతంగా ఉంది అని అంటున్నారు. అంటే వీరికి ఎంత డబ్బు ఉన్నా ఖుషీ అయితే లైఫ్ లో లేదుట. దీనిని కూడా సీరియస్ గా ఆలోచించాల్సిందే మరి. అయితే ఇది భౌతిక సుఖాల ప్రపంచం. ఆ సుఖాలు అన్నీ కూడా డబ్బుతోనే వస్తాయి. మనీ ఉంటే ఎన్ని అయినా చేయవచ్చు అనుకునే వారే ఎక్కువ బాపతు.

కాబట్టి సంతోషాన్ని కొనుక్కోవాలంటే జేబు నిండా డబ్బు ఉండాలి అన్నదే డేనియల్ వారి పరిశోధనా సారం. డబ్బు లేని వాడు డుబ్బుకైనా కొరగాడు అన్న ముతక సామెత గుర్తుంచుకుంటే ఆదాయం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో డేనియల్ పరిశోధనే చెప్పనవసరం లేదు ఎవరైనా అవును నిజమనే అంటారు. సో సంతోషం సగం బలం కాదు సంపూర్ణ బలం కావాలన్నా డబ్బు నిండుగా ఉండాల్సిందే. ఇది నయా ఆర్ధిక సూత్రం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.