Begin typing your search above and press return to search.

ఇదేం ఆచారం బ్రదర్.. కట్నంగా విష సర్పాలేంటి?

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:30 PM GMT
ఇదేం ఆచారం బ్రదర్.. కట్నంగా విష సర్పాలేంటి?
X
పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. అయితే పెళ్లి తంతులో ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని ఫాలో అవుతారు. ఇక వరుడికి వధువు తల్లిదండ్రులు కట్నం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కట్నం కోసం ఎంతోమంది ఆడవాళ్లు ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి. ఇక వరకట్నం నిషేధించడం కోసం చట్టం కూడా తీసుకొచ్చారు. 1961, మే 1 నుంచి వరకట్నాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. అయితేనేం... కట్నం ఇవ్వడం ఆగిందా? అబ్బే మనవాళ్లు అది ఫాలో అవరు కదా. నేటికీ నగదు, నగలు, ఇళ్లు, పొలాలు, వాహనాల పేరిట ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. అయితే కట్నం వద్దని చెప్పినా కొందరు ఇస్తూనే ఉంటారు. మరికొందరేమో అదనపు కట్నపు వేధింపులకు బలవుతూనే ఉన్నారు. అయితే అక్కడ మాత్రం కట్నంగా పాములను ఇస్తారు.

కట్నంగా విషపు సర్పాలని కంగారు పడుతున్నారా!. అవును నిజమేనండి. వాళ్లు పాములనే కట్నంగా... అవి కూడా విషపు సర్పాలను ఇస్తారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 21 పాములను ఇస్తారు. అది ఎక్కడంటే... మధ్యప్రదేశ్ లోని గౌరియా తెగ. గౌరియా తెగ ప్రజలకు ఓ వింతైన ఆచారం ఉంది. కూతురికి పెళ్లి చేసే తల్లిదండ్రులు ఆ అల్లుడికి పాములు ఇవ్వాలి. 21 విషపు పాములను కట్నంగా ఇస్తారు. అయితే ఇవి సమర్పించకపోతే ఆ పెళ్లి పెటాకులవుతుందని వారి నమ్మకం. ఇకపోతే వీటిని ఇచ్చుకోలేని వారిని చాలా చులకనగా చూస్తారట. మరి ఆ విష సర్పాలను వాళ్లు ఏం చేసుకుంటారు అనుకుంటున్నారా..!

గౌరియా తెగ జీవనోపాధి పాములను పట్టడం. ఎన్ని పాములు పడితే వాళ్లు అంత గొప్ప వ్యక్తి. అతడు ఎంతటి విష సర్పాన్ని పట్టుకుంటే అంత బలవంతుడు అని అర్థం. తాము పట్టుకున్న పాములను జనాల ముందు ఆడిస్తారట. అలా పాములను ఆడించి వారి కుటుంబాన్ని పోషించుకోవాలంటా. అందుకే ఆడపిల్లల తండ్రి తమ అల్లుడికి పాములను ఇవ్వాలి. ఈ విధంగా తమకు వచ్చిన పాముల సయ్యాటలతో వాళ్లు డబ్బు సంపాదించుకుంటారు. అలా వారి తమ పొట్టపోసుకుంటూ జీవనం సాగిస్తారు. ఇకపోతే ఈ పాములను వారు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారట. పైగా కట్నంగా వచ్చిన పాములను చాలా జాగ్రత్తగా చూసుకుంటారంటా.

వరకట్నంగా వచ్చిన పాములను ఓ బాక్సులో భద్రపరుస్తారు. ఒకవేళ అందులో పాము చనిపోతే అశుభంగా భావిస్తారట. అంతేకాకుండా కుటుంబం అంతా కూడా గుండు చేయించుకుంటారంటా. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారంటా. ఎందుకంటే వాళ్లకు ఆ పాములే జీవనాధారం కదా. అయితే వాళ్ల ఆచారం ప్రకారం పాములే వారికి ప్రతిష్ఠ. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. విషపు పాములను కట్నంగా ఏంటి బ్రదరూ... అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పామును చూస్తేనే అల్లంతా దూరానా పారిపోయే మనం... విషపు సర్పాలు వరకట్నంగా అంటే మామూలు విషయం కాదు.