Begin typing your search above and press return to search.

వైరస్ కోసం పార్టీలు: అమెరికాలో విద్యార్థుల పిచ్చి

By:  Tupaki Desk   |   3 July 2020 6:30 AM GMT
వైరస్ కోసం పార్టీలు: అమెరికాలో విద్యార్థుల పిచ్చి
X
ఎవరైనా ఉన్న రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ లేని రోగాన్ని తెచ్చుకోవాలని ఎవరూ ప్రయత్నించరు. కానీ అమెరికాలో మాత్రం మహమ్మారి వైరస్ సోకాలని ప్రత్యేక ఆసక్తి పెంచుకుని ఏకంగా సామూహిక పార్టీలు నిర్వహించారు. ఇందులో ఎవరికి మొదట వ్యాపిస్తే వారికి భారీ నగదు బహుమానం ప్రకటించారు. ఈ దారుణ ఘటన అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రంలోని కొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు వైరస్ పేరిట పార్టీలు చేసుకున్నారు. దీనికి వైరస్ సోకిన వారిని కూడా ఆహ్వానించారు. పాజిటివ్ సోకిన వారి ద్వారా మిగతా వారికి వైరస్ ఎంత తొందర సోకుతుందో తెలుసుకోవడమే పార్టీ ఉద్దేశం. అలా పార్టీకి హాజరైనవారిలో మొదట ఎవరికి వైరస్ సోకుతుందో వారికి ప్రైజ్ మనీ అందిస్తున్నారు.

ఈ విషయం తెలిసి అక్కడి అధికారులు షాక్ కు గురయ్యారు. విద్యార్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా వైరస్ సోకాలని భావించడం.. వైరస్ ఉధృతికి కారణంగా నిలవడం నేరంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై టుస్కాలోసా సిటీ కౌన్సిలర్ సోన్య మెకిన్స్ట్రీ స్పందించారు.

విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే వైరస్ ను వ్యాప్తి చేసేందుకే ఈ పార్టీలు నిర్వహించారని స్పష్టం చేశారు. మొదట తాము ఇవి పుకార్లేనని భావించినట్లు.. కొంత స్పష్టత వచ్చాక తాము షాకయ్యామని తెలిపారు. స్థానిక వైద్యులు, అధికారులు కూడా ఇది నిజమేనని తేల్చారని చెప్పారు. ఆ పార్టీలో ఒక కుండలో భారీ మొత్తంలో డబ్బు పెట్టి.. మొదట పాజిటివ్ సోకిన వ్యక్తితో దాన్ని టచ్ చేయిస్తున్నారని వివరించారు . అతడు ముట్టిన తర్వాత పార్టీకి హాజరైన వారు తాకాలని.. అనంతరం వారికి పరీక్షలు చేస్తే ఎవరికి పాజిటివ్‌ తేలుతుందో వారు ఆ కుండలోని డబ్బును వారికి ప్రైజ్ మనీగా అందజేస్తున్నారని ఆమె వెల్లడించారు.

ఇలాంటి పార్టీలు కొన్ని వారాలుగా టుస్కలోసాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇది అత్యంత బాధ్యతరాహిత్యం అని... పార్టీలకు వెళ్లి వైరస్ అంటించుకుని,ఆపై ఇంట్లో వాళ్లకు కూడా వ్యాప్తి చేస్తున్నారని అక్కడి అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 39 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తో సుమారు వెయ్యి మంది మృతి చెందారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో... ఇలా విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా వైరస్‌ను వ్యాప్తి చెందిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.