Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కుదుటపడ్డ తిరుమల..స్వామి సేవలో పెద్ద జీయం గార్లు

By:  Tupaki Desk   |   21 Aug 2020 11:10 AM GMT
కరోనా నుంచి కుదుటపడ్డ తిరుమల..స్వామి సేవలో పెద్ద జీయం గార్లు
X
కరోనా బారిన నుంచి టీటీడీ కోలుకుంటోంది. ఆలయ అర్చకులు, సిబ్బంది వందలాది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా మారి పెద్ద జీయం గార్లను చెన్నై అపోలోకు తరలించగా ఆయన చికిత్స పొందుతూ కోలుకున్నారు. మార్చిలో కరోనా తీవ్రత మొదలవగానే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసేసింది. అయితే సంపూర్ణ లాక్ డౌన్ ముగిసి నిబంధనలతో కూడిన సడలింపులు ఇవ్వడంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరవాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలతో తిరుమలలో మళ్ళీ దర్శనాలను ప్రారంభించింది. మామూలు సమయంలో తిరుమలలో రోజుకు 70 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించు కుంటుంటారు. ఈ సంఖ్యను సగం వరకు కుదించి టీటీడీ భక్తులకు దర్శనాలను ప్రారంభించింది.

కొండ దిగువన తిరుపతిలో, తిరుమలలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి స్లాటెడ్ దర్శనాలకు టోకెన్లు ఇవ్వడం మొదలు పెట్టింది
ఈ నేపథ్యంలో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు దర్శనానికి వస్తుండడంతో క్రమేణా టీటీడీ లోని అర్చకులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు కరోనా బారిన పడ్డారు. సుమారు ఇప్పటివరకు టిటిడి లో 700 మందికి పైగా సిబ్బందికి పాజిటివ్ తేలింది. దీంతో దర్శనాల విషయంలో టిటిడి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కరోనా ఇంత ప్రబలుతున్న సమయంలో అంత మందికి భక్తులకు దర్శనాలు కల్పించడం ఏమిటని విమర్శలు వచ్చాయి. దీంతో టిటిడి పునరాలోచనలో పడింది. భక్తుల దర్శనాలను చాలావరకు తగ్గించింది. తిరుపతిలో స్లాటెడ్ టోకెన్లు ఇవ్వడం నిలిపివేసింది. ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనాలకు టోకెన్లు ఇస్తున్నారు. అందులో దర్శనం రోజు, సమయం కూడా ఇస్తున్నారు. ఆ సమయానికల్లా భక్తులు తిరుమలకు చేరుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య తగ్గించడంతో తిరుమలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

అంతకుముందు కరోనా బారిన పడ్డవారు కూడా ఒక్కొక్కరుగా కోలుకుంటున్నారు. ఇటీవల కరోనా బారినపడి ఆలయ పెద్ద జీయంగార్లు ఖాద్రీపతి నరసింహాచార్యులు చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డారు. చికిత్స నుంచి ఆయన కోలుకొని శుక్రవారం స్వామివారి కైంకర్య సేవలో పాల్గొన్నారు. ఇప్పటివరకు టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు, మరో అర్చకుడు మొత్తం ఇద్దరు అర్చకులు వైరస్ బారిన పడి కన్నుమూశారు. మిగతా ఏడు వందలకు పైగా సిబ్బంది కరోనా నుంచి బయటపడి విధులకు హాజరవుతుండంతో టీటీడీ కాస్త కోలుకుంది.