Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కొత్త వైరస్ టెంక్షన్ .. జాగ్రత్తగా ఉండండి !

By:  Tupaki Desk   |   25 Dec 2020 6:40 AM GMT
హైదరాబాద్ లో కొత్త వైరస్ టెంక్షన్ .. జాగ్రత్తగా ఉండండి !
X
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌ పై తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తరకం స్ట్రెయిన్ ‌పై ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి…తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.

కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మంత్రి ఈటల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా రెండో దశను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి ఈటలకు తెలిపారు వైద్య శాఖాధికారులు. తెలంగాణకు మొత్తం 12 వందల మంది ప్రయాణికులు రాగా..వారిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వీరిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. యూకే నుంచి వచ్చిన వారిలో ఏ రకం వైరస్ ఉందో తెలుసుకోవడానికి బ్లడ్‌ శాంపిల్స్‌ని సీసీఎంబీ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు.

కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఈటల రాజేందర్‌. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలకు ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్క్, భౌతిక దూరం, తరచూ చేతులు శుబ్రపరుచుకోవడం మరిచిపోవద్దని కోరారు. కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి రాగానే ప్రజలకు అందించేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి ఈటల. వ్యాక్సిన్ వేసేందుకు పదివేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని..ఒక్కొక్కరు రోజుకు వంద మందికి టీకా వేసినా పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయగలమని అధికారులు తెలిపారు.

మొదటి దశలో 70 నుండి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. కరోనా లాంటి మహమ్మారులను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈటల అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 11 సిటీ స్కాన్‌ సెంటర్లు, 3 ఎంఆర్ఐ యంత్రాలను వెంటనే కొనుగోలు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.