Begin typing your search above and press return to search.

తెలంగాణ తాజా బులిటెన్.. కేసులు తగ్గాయా.. ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   24 Aug 2020 10:30 AM IST
తెలంగాణ తాజా బులిటెన్.. కేసులు తగ్గాయా.. ఎంతవరకు నిజం?
X
కరోనా తాజా బులిటెన్ ను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే.. ఈ రోజు (సోమవారం ఉదయం) రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో 1842 కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొంది. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కొత్త కేసులు 1.06లక్షలకు చేరింది. తాజా నివేదిక ప్రకారం ఆరుగురు మరణించినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా మరణించిన వారి సంఖ్య 761కు చేరింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా నమోదైన కేసులు.. ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య దాదాపు దగ్గరగా రావటం కాస్తంత ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. తాజాగా 1842 కొత్త కేసులు నమోదైతే.. వైరస్ బారి నుంచి కోలుకున్న వారు 1825 కావటం గమనార్హం. మొత్తం లక్ష కేసులు దాటగా.. ఇప్పటివరకు 82411 మంది రికవరీ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 22919 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 16482 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 36,282 పరీక్షలు నిర్వహించారు. దీంతో.. ఇప్పటివరకు తెలంగాణలో 9.68లక్షలు నిర్వహించారు. మరో 895 మంది రిపోర్టు రావాల్సి ఉంది. గడిచిన నాలుగైదు రోజులుగా రెండువేలు.. రెండు వేలకు దగ్గరగా నమోదైన పాజిటివ్ కేసులకు భిన్నంగా తాజాగా కేసుల సంఖ్య తగ్గటానికి కారణం వరుసగా వచ్చిన సెలవులుగా చెబుతున్నారు.

శనివారం వినాయకచవితి.. ఆ తర్వాత రోజు ఆదివారం రావటంతో.. కేసుల నమోదు తక్కువగా ఉందని చెబుతున్నారు. యాంటీ జెన్ తప్పించి.. ఆర్టీపీసీ పరీక్షలకు 72 గంటలు తీసుకుంటున్న నేపథ్యంలొ.. కేసుల నమోదు సంఖ్య తక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.