Begin typing your search above and press return to search.

ఏపీలో కనిపించే ఇలాంటివి తెలంగాణలో ఉండవా సారు?

By:  Tupaki Desk   |   8 July 2020 7:00 AM GMT
ఏపీలో కనిపించే ఇలాంటివి తెలంగాణలో ఉండవా సారు?
X
మహమ్మారిని తరిమి కొట్టేందుకు అవసరమైతే రూ.5వేల కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడమని తెలంగాణ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మహమ్మారి తన తీవ్రతను చూపించని వేళ.. సారు వారు చెలరేగిపోయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఇప్పుడేంటి మొత్తంగా వదిలేశారన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఎంత చేసినా.. మహానగరాలకు ఉండే ఇబ్బందికర పరిస్థితుల కారణంగా మహమ్మారి వ్యాపిస్తుందే తప్పించి.. ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తునే ఉన్నారన్న సమర్థింపు మాట కొందరి నోట వినిపిస్తోంది.

ప్రభుత్వాన్ని తప్పు పట్టే మాటలకు సమర్థింపుతో చెక్ పెట్టటం మామూలే. అయితే.. ఇలాంటి మాటలు సైతం మూగబోయే పరిణామాలు కొన్ని చేసుకుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిగిలిన రాష్ట్రాలకంటే మిన్నగా మాయదారి రోగాన్ని అడ్డుకునేందుకు తెలంగాణలో భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పటం తెలిసిందే.

మాటలు సంగతి పక్కన పెట్టి.. వాస్తవం ఎలా ఉందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్ ఆవరణలో భారీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ వాహనానికి పది కౌంటర్లను ఏర్పాటు చేయటం.. ఒక్కో కౌంటర్ వద్దకు వెళ్లేందుకు వీలుగా ఇనుప మెట్లను సిద్ధం చేశారు. ఇంతకీ ఈ వాహనం చేసే పనేమిటంటే.. ట్రైన్లలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా విధిగా.. ఈ మొబైల్ వాహనం వద్ద తమ శాంపిల్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శాంపిల్ లో వచ్చే ఫలితం ఆధారంగా వారిని క్వారంటైన్ కు పంపాలా? హోం క్వారంటైన్ కు పంపాలా? ఆసుపత్రికి పంపాలన్నది డిసైడ్ చేస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ వాహనం లాంటివి ఏపీలో ఏకంగా ఇరవై ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు.. బస్టాండ్లు.. ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవటం ద్వారా.. ఫలితాలు తేలిపోవటమే కాదు.. వైరస్ వ్యాప్తికి అంతో ఇంతో చెక్ పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పాలి. దేశంలోనే ఈ తరహా పరీక్షల్ని ఏపీలోనే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ తెలంగాణలోని తెలుగువారికి కలిగే సందేహం ఏమిటంటే.. ఇలాంటి ముందస్తుపరీక్షలు సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు చేయరు? అని. ఈ తరహా మొబైల్ వాహనం ఒక్క విజయవాడలోనే ఆరు పాయింట్ల వద్ద ఏర్పాటు చేయటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి తెలంగాణలో అందునా హైదరాబాద్ లాంటి మహానగరంలో మరెన్ని చేయాలంటారు?అయినా.. ఇలాంటివేమీ తెలంగాణలో ఎందుకు కనిపించవు కేసీఆర్ సార్?