Begin typing your search above and press return to search.

ఈటెలకు ఊరటనిచ్చేలా ఐసీఎంఆర్ ప్రివలెన్సు సర్వే

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:30 AM GMT
ఈటెలకు ఊరటనిచ్చేలా ఐసీఎంఆర్ ప్రివలెన్సు సర్వే
X
చూస్తుండగానే తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఒత్తిడి ప్రభుత్వం మీదా.. మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ మీద ఎక్కువగా ఉంది. తానెంతగా ప్రయత్నిస్తున్నా.. కేసుల సంఖ్యను తగ్గించలేకపోతున్నట్లుగా తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రులకు భిన్నంగా ఈటెల తీవ్ర టెన్షన్ కు తరచూ గురవుతున్నట్లు చెబుతున్నారు. తాజా పరిస్థితులు ఈటెల సమర్థతకు కొలమానంగా మారటం ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇటీవల పెరుగుతున్న పాజిటివ్ కేసులు మాయదారి రోగం విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఐసీఎంఆర్.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థలు సంయుక్తంగా సీరం సర్వేను హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్టులు తాజాగా వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో తీసిన శాంపిల్స్ ను పరీక్షించగా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు తేల్చారు.
మే మూడు.. నాలుగు వారాల్లో నిర్వహించిన పరీక్షల్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు.. జనగాం.. కామారెడ్డి.. నల్గొండ జిల్లాల్లో వందల సంఖ్యలో శాంపిల్స్ ను సేకరించారు. అదే సమయంలో హైదరాబాద్ లోని అయిదు కంటైన్మెంట్ ప్రాంతాలైన ఆదిభట్ల.. టప్పచబుద్ర.. మియాపూర్.. చందానగర్.. బాలాపూర్ లలో శాంపిల్స్ సేకరించారు. వీటిని పరిశీలించగా.. కేవలం 15 మాత్రమే పాజిటివ్ గా తేలాయి.

లాక్ డౌన్ ను విజయవంతంగా నిర్వహించటంతోనే ఇలాంటి ఫలితాలు సాధ్యమైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సర్వే రిపోర్టు పేరుతో సంతోషపడటానికి మించిన తప్పు మరొకటి లేదంటున్నారు. ఎందుకంటే.. మే రెండో వారానికి ప్రస్తుత పరిస్థితికి సంబంధం లేదంటున్నారు. లాక్ డౌన్ సడలింపులు భారీగా ఇచ్చేసిన ఇప్పటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు మరోలా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే.. ఈ వాదనను తప్పు పట్టేవాళ్లు లేకపోలేదు.

కొందరు సమస్యను భూతద్దంలో చూపిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. రేపటి సంగతేమో కానీ.. ఇప్పటికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రమంత్రి ఈటెలకు టెన్షన్ తప్పి.. కాస్త సంతోషపడేలా సర్వే రిపోర్టు ఉందని చెబుతున్నారు.