Begin typing your search above and press return to search.

పాజిటివ్ అని తేలినా వారిని గాంధీలో ఆడ్మిట్ చేయరట

By:  Tupaki Desk   |   1 Jun 2020 4:15 AM GMT
పాజిటివ్ అని తేలినా వారిని గాంధీలో ఆడ్మిట్ చేయరట
X
మీరు విన్నది నిజమే. మాయదారి రోగం ఉన్నట్లు నిర్దారణ జరిగిన వెంటనే.. వారిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయటం తెలిసిందే. ఇప్పటివరకూ అమలు చేసిన విధానాన్ని మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంలో పాజిటివ్ గా తేలినా.. వారికి వైద్యం ఇచ్చేందుకు గాంధీలో ఆడ్మిట్ చేయరని చెబుతున్నారు. ఎందుకిలా అంటే?

ఇటీవల కాలంలో పాజిటివ్ గా తేలిన వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించటం లేదు. పాజిటివ్ గా వచ్చిన వారికి దగ్గరగా ఉండటమో.. సన్నిహితంగా ఉండటం కారణంగానే వారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా పరీక్షల్లో నిర్దారణ అవుతోంది. అదే సమయంలో.. వారిలో జ్వరం కానీ దగ్గు కానీ.. గొంతు పట్టేయటం లాంటివేమీ ఉండటం లేదు. ఇదిలా ఉంటే.. రోజులు గడుస్తున్నకొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజులోనే తెలంగాణలో 199 కేసులు నమోదు కావటం ఒక ఎత్తు అయితే.. గ్రేటర్ పరిధిలోనే 120కు పైగా పాజిటివ్ లు తేలాయి.

మరో కీలక అంశం ఏమంటే.. ఆదివారం పాజిటివ్ గా తేలిన చాలా మందిలో రోగ లక్షణాలు ఏమీ లేకపోవటం. ఈ నేపథ్యంలో పాజిటివ్ గా తేలిన వారికి హోం క్వారంటైన్ లో ఉంచాలని తెలంగాణ అధికారులు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న విధానానికి భిన్నంగా పాజిటివ్ వచ్చినా.. వారిలో రోగ లక్షణాలు ఏమీ కనిపించకుంటే మాత్రం గాంధీలో చేర్చకుండా ఇంటివద్దే వైద్యం అందేలా చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం స్వల్ప లక్షణాలతో పాజిటివ్ ఉన్న వారి సంఖ్య గాంధీలో 500 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు.. అసలు ఎలాంటి లక్షణాలు లేని వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివారికి చికిత్స పేరుతో గాంధీలో ఉంచటం ఇబ్బందిగా మారుతున్నట్లు చెబుతున్నారు. అందుకే.. తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వారికే చెప్పి.. వారి ఇళ్లల్లోనే ఉండిపోయి చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి అవసరమైన అన్ని మందుల్ని ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల స్వల్ప లక్షణాలు ఉన్న వారు వారి ఇళ్లల్లోనే పరిమితుల మధ్య చికిత్స తీసుకోవటం ద్వారా.. కేసుల ఒత్తిడికి చెక్ పెట్టొచ్చంటున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.