Begin typing your search above and press return to search.

మహారాష్ట్రకు ఏమైంది? ఒక్క రోజులో ఎన్ని కేసులో తెలుసా?

By:  Tupaki Desk   |   7 April 2021 8:30 AM GMT
మహారాష్ట్రకు ఏమైంది? ఒక్క రోజులో ఎన్ని కేసులో తెలుసా?
X
మాయదారి మహమ్మారి మహారాష్ట్రను అస్సలు విడిచి పెట్టటం లేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నది ఆ రాష్ట్రంలోనే. దేశంలో నమోదయ్యే కేసుల్లో సింహభాగం ఆ రాష్ట్రంలోనివే కావటం గమనార్హం. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు ఎక్కువ అవుతోంది. చర్యలు తీసుకోవటంలో మహారాష్ట్ర సర్కారు కిందామీదా పడుతున్నా.. కేసుల అదుపు మాత్రం సాధ్యం కావటం లేదు. తాజాగా ఒక్కరోజులో మహారాష్ట్రలో నమోదైన కేసులు కొత్త రికార్డును క్రియేట్ చేశారు.

రోజు వ్యవధిలో ఏకంగా 55వేలకు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. ఒక్క ముంబయి మహానగరంలోనే ఒక్క మంగళవారం పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంత భారీగా ఒక రాష్ట్రంలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కరోనా కేసులు మొదలైన నాటి నుంచి ఒక రోజులో ఇన్ని కేసులు ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు కాలేదు.

సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో.. కేసుల నమోదును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల్ని విధించింది. ఇప్పటికే రాత్రిళ్లు కర్ఫ్యూ విధించారు. వారాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసుల నమోదు మాత్రం తగ్గకపోవటం ఇప్పుడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. ఓపక్క వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతున్న వేళలోనూ.. ఇంత భారీగా కేసులు నమోదు కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పాలకులకు సవాలు విసురుతున్న కరోనా నుంచి మహారాష్ట్ర ఎప్పటికి బయటపడుతుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.