Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు!

By:  Tupaki Desk   |   27 March 2021 3:37 AM GMT
కరోనా ఎఫెక్ట్.. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు!
X
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా 24 గంటల్లో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో శుక్రవారం నాడు 36 వేల 902 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 28 రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు.

రాత్రి అన్నీ బంద్

కరోనా దృష్ట్యా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. కాగా ఆ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 వరకు ఆంక్షలు విధించినట్లు మహా సర్కార్ ప్రకటించింది. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు అన్నీ మూసేయాలని ఆదేశించింది. ఇక లాక్ డౌన్ విధించే అవకాశం లేదని తెలిపిన ఉద్ధవ్... ప్రజారోగ్యం దృష్ట్యా ఈ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆ రాష్ట్ర వైద్యశాఖను అప్రమత్తం చేశారు. రాత్రి కర్ఫ్యు కచ్చితంగా అమలులో ఉంటుందని... నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్ దృష్ట్యా హోలీ పర్వదినాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆ రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించింది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 26 లక్షల 37 వేల కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ ప్రకటించింది. కాగా మొత్తం 53 వేల 907 మంది బాధితులు మృతి చెందినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధమైంది.