Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ .. ఒక్కరోజే 16,620 పాజిటివ్ కేసులు !

By:  Tupaki Desk   |   15 March 2021 7:31 AM GMT
మహారాష్ట్రలో కరోనా విజృంభణ .. ఒక్కరోజే 16,620 పాజిటివ్ కేసులు !
X
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి జోరు మాములుగా లేదు. తాజాగా గత 24 గంటల్లో ఈ ఏడాదిలోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో 16,620 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు సంఖ్య 23,14,413 కు చేరుకుంది. ఒక్కరోజే 50 మంది మరణించడంతో మృతుల సంఖ్య 52,861 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో గత రెండు రోజుల్లో, రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 15,000 పైన నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆదివారం 16,000 మార్కును దాటింది. నిన్న ఒక రోజులో 8,861 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,34,072 కు పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని కోవిడ్-19 రికవరీ రేటు 92.21 శాతం, మరణాల రేటు 2.28 శాతంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,26,231 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కరోనా బారినపడిన 5,83,713 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా, 5,493 మంది క్వారంటైన్ అయ్యారు. ఆదివారం 1,08,381 మందిని పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,75,16,885 కు చేరింది. ముంబై నగరంలో కొత్తగా 1,963, పూణే నగరం లో 1,780 కేసులు, ఔరంగాబాద్ నగరంలో 752, నాందేడ్ లో 351, పింప్రి చిన్చ్వాడ్ లో 806 కేసులు, అమరావతి లో 209, నాగ్‌పూర్లో 1,976 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు అహ్మద్‌ నగర్ లో 151, జల్గావ్ సిటీ 246, నాసిక్ సిటీ 946 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటం తో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు . కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోతే మరొకసారి లాక్ డౌన్ విధిస్తామని, కఠినమైన లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి అదుపు తప్పుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు . కరోనా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.