Begin typing your search above and press return to search.

అనారోగ్యం ఉన్నా పెళ్లి.. ఏకంగా 43మందికి పాజిటివ్‌

By:  Tupaki Desk   |   27 July 2020 8:10 AM GMT
అనారోగ్యం ఉన్నా పెళ్లి.. ఏకంగా 43మందికి పాజిటివ్‌
X
వ‌ధువుకు అనారోగ్యం ఉంద‌నే విష‌యం తెలిసి కూడా ఆ తండ్రి ఆమె వివాహం హ‌డావుడిగా జ‌రిపించాడు. ఆ ఒక్క త‌ప్పిదం ఏకంగా 43 మంది వైర‌స్ బారిన ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. పెళ్లి కుమార్తె.. వ‌రుడితో పాటు కుటుంబ‌స‌భ్యులు.. బంధువులంద‌రికీ వైర‌స్ సోకింది. దీనికి కార‌ణ‌మైన వ‌ధువు తండ్రిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. చివ‌ర‌కు పెళ్లి ఇల్లు కాస్త వైర‌స్‌కు కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇరు కుటుంబాల‌న్నీ క్వారంటైన్ లో ఉన్నాయి.

కర్ణాటక స‌రిహద్దులో కేర‌ళ రాష్ట్రంలోని కాసరగూడు జిల్లా ఉంది. క‌ర్నాట‌క ప్ర‌భావంతో కాసరగూడు జిల్లాలో వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ జిల్లాకు చెందిన ఓ యువతికి జూలై 17వ తేదీన వివాహం చేయాల‌ని నిశ్చయ‌మైంది. పెళ్లి రోజు ద‌గ్గ‌ర‌కు రాగానే ఆ యువ‌తి అనారోగ్యానికి గుర‌య్యింది. జూలై 15వ తేదీన ఆమె అనారోగ్యానికి గుర‌వ‌గా యువ‌తి తండ్రి నిర్ల‌క్ష్యం చేశాడు. ఆమె అనారోగ్యంతో ఉంటే పెళ్లి ఆపేస్తే క‌ష్ట‌మ‌ని.. భ‌విష్య‌త్‌ను త‌లుచుకుని ఆ యువ‌తికి పెళ్లి చేయాల‌నే నిశ్చ‌యించుకున్నాడు. ఈ విష‌యం వ‌ధువు వ‌రుడికి చెప్ప‌గా అత‌డు నిర్ల‌క్ష్యం చేశాడు. ఈ విష‌యాన్ని వ‌రుడి కుటుంబ‌స‌భ్యుల‌కు చెప్పకుండా పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. ఏం కాదులే అని నిర్ల‌క్ష్యం చేసి అనుకున్న ప్రకారం జూలై 17వ తేదీన వివాహం జ‌రిపించారు. 50 మందికి పైగా కుటుంబ‌స‌భ్యులు.. బంధువులు హాజ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత భోజ‌నాలు చేసి అంద‌రూ వెళ్లిపోయారు.

అయితే రెండు రోజుల‌కు పెళ్లికి హాజరైన వారు అనారోగ్యానికి గుర‌య్యారు. అంద‌రూ అనారోగ్యం చెంద‌డంతో విషయం తెలుసుకున్న కాసరగూడు జిల్లా వైద్యశాఖ అధికారులు నవ దంపతులతో సహా పెళ్లికి హాజరైన వారందరికీ వైద్య పరీక్ష్లలు చేశారు. దీంతో పెళ్లి కుమారుడు, కుమార్తెతో పాటు పెళ్లికి హాజరైన 43 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారంతా షాక్‌కు గురయ్యారు. నవందపతులతో సహా పెళ్లికి వెళ్లిన 43 మందిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం అని తెలిసి కూడా పెళ్లి జ‌రిపించి వైర‌స్ వ్యాప్తికి కారణమ‌య్యాడని పెళ్లి కుమార్తె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఒక‌రి నిర్లక్ష్యం వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మైంది.