Begin typing your search above and press return to search.

ఇంతలా దాచిపెట్టారా? 4 రాష్ట్రాల్లో కరోనా అధికారిక మరణాలు 37వేలు..కానీ నిజం ఇదేనట

By:  Tupaki Desk   |   22 Jun 2021 1:53 AM GMT
ఇంతలా దాచిపెట్టారా? 4 రాష్ట్రాల్లో కరోనా అధికారిక మరణాలు 37వేలు..కానీ నిజం ఇదేనట
X
మహమ్మారి మరణాల మీద సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏదైనా విపత్తు చోటు చేసుకున్నప్పుడు అధికారిక లెక్కలకు వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. అంతమాత్రాన పొంతన లేకుండా ఉండటం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. మరణాలు.. రోగ తీవ్రత గురించి చెబుతూ భయపెడతారా? అని ప్రశ్నించొచ్చు. చేదైన నిజాల్ని రికార్డు చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఒక వార్నింగ్ ఇవ్వటంతోపాటు.. విపత్తులు విరుచుకుపడినప్పుడు చేయకూడని తప్పులేమిటన్న విషయాన్ని తెలియజేసేలా చేస్తుంది.

కరోనా మరణాల మీద వివాదం ఇవాల్టిది ఏమీ కాదు. దీనిపై పెను వివాదం నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్.. మధ్యప్రదేశ్.. కర్ణాటక.. తమిళనాడులలో 2021 జనవరి నుంచి మే వరకు కొవిడ్ మరణాల కేవలం 37వేలు మాత్రమే చూపించారు. మరి.. వాస్తవం ఏమిటి? అన్నది చూస్తే.. దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నమోదు చేసిన మరణాల్ని చూసినప్పుడు.. కరోనాకు ముందు ప్రతి ఏటా చోటు చేసుకునే సరాసరి మరణాల్ని చూసినప్పుడు.. అయిదు నెలల్లో 5.29 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంటే.. అధికారికంగా ప్రకటించిన కొవిడ్ మరణాల కంటే.. సుమారు 14 రెట్లు ఎక్కువగా చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మరణాల నమోదు కూడా సరిగా జరగదని.. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా కొవిడ్ మరణాలు మనం కలలో కూడా ఊహించలేనంత భారీగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

సెకండ్ వేవ్ లో దేశంలో నమోదైన కరోనా అధికారిక లెక్కలకు ఏ మాత్రం పొంతన లేకుండా మరణాలు ఉంటాయని చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించిన దాని కంటే కూడా తక్కువలో తక్కువ 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది మరణించిన ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇదేదో కాకి లెక్కల మాదిరి కాకుండా.. కొన్ని అంశాల ప్రాతిపదికన ఈ లెక్క వేశారు. ఇదే విషయాన్ని ఐఐఎం అహ్మదాబాద్ అర్థశాస్త్ర ప్రొఫెసర్ చిన్మయ్ తుంబే లెక్క వేశారు.

ఆయన మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పుడు చెప్పిన మరణాల లెక్క కేవలం అంచనా మాత్రమే కానీ.. వాస్తవంగా లెక్కేస్తే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పినప్పుడు.. కరోనా మహమ్మారి దేశ ప్రజల్న ఊసురును భారీగా తీసిందన్న వాస్తవం అర్థం కాక మానదు. ఆయన లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్.. బిహార్.. జార్ఖండ్ లాంటి రాష్ట్రాల వివరాల్ని లెక్కలోకి తీసుకోకుండా చూస్తేనే రెండో దశలో వెల్లడి కాని కొవిడ్ మరణాలు కనీసం 15 లక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదంతా విన్నప్పుడు జరిగిన నష్టాన్ని తక్కువ చేసి చూపించటం ద్వారా ప్రభుత్వాలు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటుందా? అన్న సందేహం కలుగక మానదు.