Begin typing your search above and press return to search.

త‌గ్గుతున్న వైర‌స్.. పెరుగుతున్న భ‌యం!

By:  Tupaki Desk   |   30 May 2021 2:30 AM GMT
త‌గ్గుతున్న వైర‌స్.. పెరుగుతున్న భ‌యం!
X
దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌గ్గుతోంది. కానీ.. జ‌నాల్లో మాత్రం భ‌యం పెరుగుతూనే ఉంది. దీని కార‌ణం.. ఫంగ‌స్ దాడి పెర‌గ‌డ‌మే. గ‌డిచిన ఇర‌వై నాలుగు గంట‌ల్లో కేసులు రెండు ల‌క్ష‌ల దిగువ‌కు న‌మోద‌య్యాయి. దీంతో.. కేసుల సంఖ్య త‌గ్గుతున్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ.. ఫంగ‌స్‌కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

దేశంలో బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ ల తీవ్ర‌త వేగంగా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 12 వేల కేసులు న‌మోదు కాగా.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర‌త మ‌రింతగా పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌మ‌వుతోంది.

ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఒక‌రిలో ఒక‌టికి మించిన ఫంగ‌స్ లు క‌నిపిస్తుండ‌డం మ‌రింత భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఘ‌జియా బాద్ లో ఓ వ్య‌క్తిలో ఏకంగా క‌రోనాతోపాటు మూడు ఫంగ‌స్ ల‌ను గుర్తించ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

కున్వ‌ర్ సింగ్ అనే 59 ఏళ్ల వ్య‌క్తిలో క‌రోనాతోపాటు బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ ను వైద్యులు గుర్తించారు. వీటితో పోరాడ‌లేక ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఈ వైర‌స్ లు ముప్పేట దాడిచేయ‌డంతో ఆయ‌న అవ‌య‌వాలు పూర్తిగా పాడైపోయాయ‌ని, ర‌క్తం మొత్తం క‌లుషితం అయిపోయింద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

అదేవిధంగా.. ఇదే రాష్ట్రంలోని మురాద్ న‌గ‌ర్ కు చెందిన మ‌రో వ్య‌క్తిలోనూ క‌రోనాతోపాటు ఎల్లో ఫంగ‌స్ ను గుర్తించారు. అత‌డి మెద‌డులో ఫంగ‌స్ ఇన్ఫెక్ష‌న్ క‌లిగించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఈ విధంగా ఫంగ‌స్ విజృంభిస్తుండ‌డంతో.. క‌రోనా త‌గ్గుతుంద‌నే ఆనందం జ‌నాల్లో క‌నిపించ‌ట్లేదు. అందువ‌ల్ల అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు నిపుణులు.