Begin typing your search above and press return to search.

మరోసారి 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు ... ఎన్ని మరణాలంటే ?

By:  Tupaki Desk   |   7 May 2021 7:30 AM GMT
మరోసారి 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు ... ఎన్ని మరణాలంటే ?
X
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌హోగ్ర‌రూపం రోజురోజుకి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. దీనితో రోజువారీ కేసులు మ‌రోసారి నాలుగు లక్ష‌లు దాటాయి. కరోనా వైర‌స్‌ విజృంభ‌ణ‌తో నిన్న 4 ల‌క్ష‌ల 10 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నాలుగు వేల‌కు చేరువ‌లో మ‌ర‌ణాలు రికార్డ‌య్యాయి. దేశంలో మూడు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌డం వ‌రుస‌గా ఇది 15వ రోజు. నిన్న‌ కొత్త‌గా 4,14,188 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,31,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,14,91,598కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,34,083కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,76,12,351 మంది కోలుకున్నారు. ఇండియాలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇంత భారీ సంఖ్య‌లో న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. మే 1న మొద‌టిసారిగా 4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. తాజాగా దానికంటే మ‌రో 10 వేలు కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. కాగా, కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 51,880 కేసులు ఉండ‌గా, క‌ర్ణాట‌క‌లో 50,112 ఉన్నాయి. దీంతో మ‌హారాష్ట్ర త‌ర్వాత దేశంలో 50 వేల‌కుపైగా కేసులు న‌మోదైన రాష్ట్రంగా క‌ర్ణాట‌క నిలిచింది. అయితే మ‌ర‌ఠ్వాడాలో క‌రోనా కేసులు కొద్దిగా త‌గ్గ‌డం విశేషం. అక్క‌డ మంగ‌ళ‌వారం 57,640 న‌మోద‌వ‌గా, నిన్న 51880కి తగ్గాయి. ఇక కేర‌ళ‌లో 41,953, త‌మిళ‌నాడులో 23,310, ప‌శ్చిమ‌బెంగాల్‌లో 18,102, పంజాబ్‌లో 8,105 న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే.. కొత్త‌గా న‌మోదైన 3980 మ‌ర‌ణాల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 920 ఉండ‌గా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 357, క‌ర్ణాట‌క‌లో 346, పంజాబ్‌లో 182, హ‌ర్యానాలో 181, త‌మిళ‌నాడులో 167 చొప్పున ఉన్నాయి.