Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా మరణాలెన్నో తెలుసా ?

By:  Tupaki Desk   |   5 May 2021 11:30 AM GMT
దేశంలో కరోనా మరణాలెన్నో తెలుసా ?
X
యావత్ దేశాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కేసులెన్నో తెలుసా ? సుమారు 2.02 కోట్లు. అంటే ఈ 2 కోట్ల కేసులు కూడా గడచిన ఏడాది నుండి తాజాగా నమోదైన అప్ డేట్ తో కలుపుకుని. వీరిలో వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1.65 కోట్లమంది. సుమారు 35 లక్షలమంది వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా చనిపోయిన 3449 మందితో కలుపుకుని చనిపోయిన వారిసంఖ్య 2.22 లక్షలు మాత్రమే. అంటే నమోదైన మొత్తం కేసుల్లో మరణాల శాతం కేవలం 1.2 శాతం మాత్రమే.

వైరస్ సోకినవారితో పోల్చుకుంటే చనిపోయిన వారి సంఖ్యను చూస్తే చాలా చాలా తక్కువనే చెప్పాలి. మొత్తం కేసుల్లో 1 శాతం మరణాలు మాత్రమే ఉన్నా మరి జనాలు ఎందుకింతగా భయపడిపోతున్నారు ? ఎందుకంటే కేవలం మీడియా వల్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారిని మీడియా చాలా పెద్దదిగా చూపిస్తోంది. కేవలం నెగిటివ్ యాంగిల్లోనే వార్తలను, కథనాలను ప్రసారం చేస్తుండటంతో జనాలకు ఒకవైపు మాత్రమే కనబడుతోంది.

ఆక్సిజన్ అందక చనిపోతున్నారని, సకాలంలో అంబులెన్సు రాకపోవటంతో చనిపోయారని, టీకా వికటించి చనిపోయారని...ఇలా అనేక నెగిటివ్ వార్తలను హైలైట్ చేయటానికి మాత్రమే మీడియా ప్రాధాన్యత ఇస్తోంది. ఉదయం టీవీలు పెట్టింది మొదలు రాత్రి పడుకునేవరకు ఏ చానల్ చూసినా ఇలాంటి నెగిటివ్ వార్తలే కనబడుతున్నాయి. బాధపడుతున్న రోగుల దృశ్యాలు, ఫోటోలు, చనిపోయిన వారి గురించి ఒకటికి వందసార్లు చూపుతున్నది మీడియా. ఇదంతా జనాల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి.

అందుకనే కరోనా వైరస్ సోకిందనగానే తమకు చావు తప్పదన్న టెన్షన్ తో ముందుగానే కొందరు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. నిజానికి మీడియా పాత్ర జనాల్లో చైతన్యం చేయటమే. సమస్యను ప్రస్తావించటంతో పాటు చూపించాల్సిందే. కానీ ఇదే సమయంలో కరోనా వైరస్ సోకి కోలుకున్న రోగుల గురించి కూడా చెప్పాలి, చూపాలి. వాళ్ళ సక్సెస్ స్టోరీలకు ప్రాధాన్యత ఇస్తే చూసిన జనాలకు ఆత్మస్ధైర్యం పెరుగుతుంది. మొత్తం కేసుల్లో చనిపోయిన 1 శాతానికి మాత్రమే మీడియా ప్రాధాన్యత ఇవ్వటమే అసలు సమస్యగా మారింది.