Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గంలో వెలిగిపోతున్న శ్మ‌శానం!

By:  Tupaki Desk   |   5 May 2021 5:30 PM GMT
ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గంలో వెలిగిపోతున్న శ్మ‌శానం!
X
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో చితిమంట‌లు చ‌ల్లార‌డం లేదట‌. నిత్యం ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్న వారితో.. శ్మ‌శానం రోజంతా వెలిగిపోతూనే ఉంద‌ని స్థానికులు చెబుతున్నట్టు స‌మాచారం. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవ‌డంతో రోగులు అల్లాడిపోతున్నార‌ట. ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌లు లేక‌, ఆక్సీన్ అంద‌క, అంబులెన్సుల్లేక బాధితులు తీవ్ర అవ‌స్థలు ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల కార‌ణంగా విధుల‌కు హాజ‌రైన సుమారు 700 మంది టీచ‌ర్లు క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన‌ట్టు స‌మాచారం. ఓటు వేయ‌డానికి వ‌చ్చిన వారిలో చాలా మంది వైర‌స్ బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. బాధితుల‌కు ఆసుప‌త్రుల్లో క‌నీస సౌక‌ర్యాలు లేవ‌ని తెలుస్తోంది. ఆక్సీజ‌న్ దొర‌క్క రోగులు అల్లాడుతున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో ప‌రిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా లాక్ డౌన్ విధించాల‌ని ఏప్రిల్ 19న అల‌హాబాద్ హైకోర్టు ఆదేశించింది. కానీ.. ప్ర‌భుత్వం దీన్ని వ్య‌తిరేకించింది. ఈ తీర్పును సుప్రీంలో స‌వాల్ చేసింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, జీవ‌నోపాధిని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వాద‌న‌లు వినిపించింది. అయితే.. ఈ రెండింటిని కాపాడ‌డంలో కూడా ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

కాగా.. అక్క‌డ మ‌ర‌ణాలు చాలా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. బ‌య‌ట‌కు త‌క్కువ‌గా చూపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. రోజుకు 10 నుంచి 12 మంది మాత్ర‌మే చ‌నిపోతున్న‌ట్టు చూపుతున్నారని, నిజానికి ఈ లెక్క ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని స్థానికులు చెబుతున్న‌ట్టు స‌మాచారం. 24 గంట‌లూ శ్మ‌శానం వెలిగిపోతూనే ఉంద‌ని వారు అంటున్నార‌ట‌.

ఇంత జ‌రుగుతుంటే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, దేశ ప్ర‌ధాని క‌నీసం త‌మ‌వైపు క‌న్నెత్తి చూడ‌ట్లేద‌ని స్థానికులు ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. బెంగాల్లో ఎన్నిక‌ల కోసం ఫిబ్ర‌వ‌రి, ఏప్రిల్ మ‌ధ్య‌ 17 సార్లు వెళ్లార‌ని, కానీ.. తమ ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.