Begin typing your search above and press return to search.

భారత్‌ లో కరోనా విలయం .. ఒక్కరోజే 4 లక్షల పాజిటివ్ కేసులు !

By:  Tupaki Desk   |   1 May 2021 4:43 AM GMT
భారత్‌ లో కరోనా విలయం .. ఒక్కరోజే 4 లక్షల పాజిటివ్ కేసులు !
X
భారత్‌ లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీనితో ప్రతి రోజు కూడా పాజిటివ్ కేసులు ఘననీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 19,45,299 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 4,08,323 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,63,488కి చేరింది. అలాగే , నిన్న ఒక్కరోజే కరోనా దెబ్బకి 3,464 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,11,778కి చేరింది. నిన్న 2,97,488 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,56,71,536 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి.

ఇక ,మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామంటూ చెప్పింది. దీనికోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి అందరూ కచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలంది ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా 2.45 కోట్ల మంది రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ టీకాల కొరత వెంటాడుతుంది. 45 ఏళ్లు పైబడిన వారి రెండో డోసు కోసమే చాలా చోట్ల వ్యాక్సిన్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనితో పలు రాష్ట్రాలు ఈ రోజు నుండి అందరికి వ్యాక్సిన్ ఇవ్వలేము అంటూ ఇప్పటికే ప్రకటన ఇచ్చేశాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మే ఒకటో తేదీ నుంచి మూడో విడత వ్యాక్సిన్ ప్రారంభం కావడం జరిగే పని కాదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు చెప్పిన ఆయన పూర్తి స్థాయిలో టీకా పంపిణీ జరగడానికి కొన్ని రోజులు పట్టొచ్చని చెప్పారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.