Begin typing your search above and press return to search.

క‌రోనా తొలిద‌శ‌-మ‌లిద‌శ.. మోడీ ఫెయిల్‌

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 AM GMT
క‌రోనా తొలిద‌శ‌-మ‌లిద‌శ.. మోడీ ఫెయిల్‌
X
``అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని త‌ర‌చుగా చెప్పుకొనే భార‌త్‌.. విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల డొల్ల‌త‌నంతో అల్లాడిపోతోంది``-అని అమెరికాకు చెందిన ప్ర‌తిష్టాత్మ‌క మేగ‌జీన్‌.. `TIME` చెప్పేసింది. తాజాగా `TIME` మేగ‌జీన్ మొత్తం.. భార‌త్‌ లోని క‌రోనా ప‌రిస్థితిపై రాసిన వార్త‌లు, వ్యాసాల‌తోనే నిండిపోవ‌డం గ‌మ‌నార్హం.

`జ‌యించింది`.. నిజంకాదు!

``ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. తాము క‌రోనాను జ‌యించామ‌ని చెబుతారు. కానీ, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ నించినా.. గ‌త ఏడాది ప‌రిస్థితిని ప‌రిశీలించినా.. క‌రోనా తొలిద‌శ స‌మ‌యంలోను, ఇప్పుడు మ‌లిద‌శ స‌మ యంలోను ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యాలు విఫ‌ల‌మ‌య్యాయి. స‌మ‌యానికి త‌గిన విధంగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకోలేక పోయారు.. ఇదే పెను విప‌త్తుగా భార‌త్‌ను ముంచేసింది!`` అని `TIME` రాసుకొచ్చింది.

తొలి విడ‌త లాక్‌ డౌన్ పెద్ద త‌ప్పు!

``ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. గ‌త ఏడాది క‌రోనా తొలిద‌శ స‌మ‌యంలో కేసులు పెద్ద‌గా లేక‌పోయినా.. ప్ర‌ధాని మోడీ.. స‌డెన్‌గా లాక్‌డౌన్ విధించారు. దీంతో ఆర్థిక‌ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తిన‌గా.. వేలాది మందిగా వ‌ల‌స కూలీలు.. ఆహారం, నీరు ల‌భించ‌క‌.. ప్రాణాలు కోల్పోయారు. అంటే.. తొలిద‌శ‌లో లాక్‌డౌన్ వంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని త‌ప్పుచేశారు. ఇక‌, ఇప్పుడు.. దీనికి వంద రెట్లు ఎక్కువ‌గా త‌ప్పు చేశారు``-అని టైమ్ పేర్కొంది.

రోజుకు 0.2% వ్యాక్సినేష‌నే

దేశంలో ఉత్ప‌త్తి చేసిన వ్యాక్సిన్‌ ను భారీ సంఖ్య‌లో ఉన్న భార‌తీయుల‌కు ఇవ్వాల‌న్న స్పృహ ప్ర‌ధాని కోల్పోయారు. త‌న ఇమేజ్‌ను ప్ర‌పంచ దేశాల్లో పెంచుకునేందుకు ఆయ‌న త‌హ‌త‌హలాడిపోయారు. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో ఉత్ప‌త్తి అయిన వ్యాక్సిన్‌ను ఇక్క‌డ కేవ‌లం 0.2% పంపిణీ చేసి.. విదేశాల‌కు ఎక్కువ‌గా త‌ర‌లించేశారు. నిజానికి.. ఏదేశ‌మైనా.. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో స్వ‌దేశాన్ని కాపాడుకునేం దుకు శాయ‌శ‌క్తులా ప‌నిచేస్తుంది.

విధాన ప‌ర‌మైన లోపాలు!

కానీ, న‌రేంద్ర మోడీ మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌చారం కోసం.. ప‌నిచేశారు! అని టైమ్స్ క‌థ‌నం రాసుకొచ్చింది. మొత్తంగా.. తొలిద‌శ‌లో స‌డెన్ లాక్‌డౌన్‌, మ‌లిద‌శ‌లో వ్యాక్సిన్ ఎగుమ‌తులు వంటివి మోడీ విధాన‌ప‌ర‌మైన లోపాల్లో ప్ర‌ధాన‌మైన‌వ‌ని.. ఇవే భార‌త్‌ను క‌రోనా కోర‌ల్లో చిక్కుకునేలా చేశాయ‌ని రాసుకొచ్చింది.

భార‌త్‌ కు స‌వాళ్లు కొత్త‌కాదు!

నిజానికి భార‌త‌దేశానికి ప్ర‌జారోగ్య విప‌త్తులు కొత్త‌కాద‌ని.. వాటిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్న చ‌రిత్ర‌ను కూడా భార‌త్ సొంత చేసుకుంద‌ని టైమ్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. 1970-90 ద‌శకాల్లో వెలుగు చూసిన పోలియో, త‌ర్వాత వ‌చ్చిన `క్ష‌య‌` వంటి అనేక అనేక ఆరోగ్య విప‌త్తుల‌ను భార‌త్ .. ప్ర‌పంచ దేశాల‌క‌న్నా దీటుగా ఎదుర్కొంద‌ని పేర్కొంది. ఆ అనుభ‌వం.. ఆ సామర్థ్యం నేడు కొర‌వ‌డింద‌ని.. అత్యంత విస్తృత‌మైన నెట్ వ‌ర్క్ ఉండి కూడా భార‌త్ స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవ‌డంపై దృష్టి పెట్ట‌లేక పోయింద‌ని పేర్కొంది.

శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌లు బుట్ట‌దాఖ‌లు!

శాస్త్ర‌వేత్త‌ల హెచ్చరిక‌లు, క‌రోనా ప్ర‌భావానికి సంబంధించిన గ‌ణాంకాల‌ను అంగీక‌రిచండంలో రాజ‌కీయ ప్ర‌భావం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింద‌ని టైమ్ స్ప‌ష్టం చేసింది. ``పాజిటివ్ కేసులు ఎన్ని? హాట్ స్పాట్ లు ఎక్క‌డున్నాయి? ఎంత మంది మ‌ర‌ణిస్తున్నారు? టీకా ఎవ‌రికి అవ‌స‌రం? టీకా ఎలా వృథా అవుతోంది. అనే విష‌యాల‌పై దృష్టి పెట్ట‌లేక పోవ‌డం ప్ర‌ధానంగా వైర‌స్ విస్తృతికి కార‌ణంగా క‌నిపిస్తోంది`` అని వైద్య రంగ నిపుణులు ప్ర‌భాత్ ఝా పేర్కొన్న విష‌యాన్ని టైమ్ ఉద‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.