Begin typing your search above and press return to search.

కొవిడ్ ఔషధం ఎక్కడో కాదు.. మనలోనే ఉంది!

By:  Tupaki Desk   |   30 April 2021 4:00 AM GMT
కొవిడ్ ఔషధం ఎక్కడో కాదు.. మనలోనే ఉంది!
X
కరోనా మహమ్మారి జడలు చాస్తోన్న వేళ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శ్మశనాల్లో మృతదేహాలతో నిరీక్షించిల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ఈ సమయంలో మనోధైర్యం చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. కొవిడ్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఎక్కడో కాదు మనలోని ఉందని అంటున్నారు. ఈ సమయంలో మానసిక బలం దివ్యౌషధంగా పని చేస్తుందని చెబుతున్నారు.

ఈ విపత్కర సమయంలో మీడియా సానుకూలంగా వ్యవహరించాలని ప్రముఖ మానసిక నిపుణులు ఓ లేఖ రాశారు. రిపోర్టింగ్ చేసే సమయంలో మానసిక ధైర్యం దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బిఎన్ గంగాధర్, డాక్టర్ ప్రతిమ మూర్తి, డాక్టర్ గౌతమ్ సాహా, డాక్టర్ రాజేష్ సాగర్ తెలిపారు. హిస్టీరియా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా ఇంట్లో ఉన్న కరోనా బాధితులకు ఇది చాలా ప్రమాదకరం అని హెచ్చరించారు. వైరస్ పై ఎక్కువ ప్రచారం చేస్తే వారు మానసికంగా కుంగుబాటుకు లోనై ప్రాణాంతకంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఆక్సిజన్ కొరత, మందులు లేకపోవడం, ఆస్పత్రుల్లో పడకలు, వ్యాక్సిన్ పంపిణీ అంశాలపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహిస్తోందని చెప్పారు. ఇక కరోనా కేసులు, మరణాలు విషయంలోనూ కాస్త జాగ్రత్త అవసరమని సూచించారు. సానుకూల ధోరణి ఉన్న కథనాలను ప్రచురించాలని చెప్పారు. ఇంట్లో ఉన్న సమయంలో టీవీలు, ఫోన్లు చూస్తున్న వేళ భయానికి గురి చేసే వార్తలు వింటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని పెంచేలా వార్తలు ప్రసారం చేయాలని వ్యాఖ్యానించారు.

బాధితుల వీడియోలు, ఫొటోలు వారి బంధువల ఆర్తనాదాలు వంటి వీడియో క్లిప్పులు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవి కరోనా బాధితులనే కాకుండా ఇతరులను మానసిక కుంగుబాటుకు గురిచేస్తాయని హెచ్చరించారు. ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొనేలా ప్రజలను మీడియా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సానుకూల ప్రభావం ఉన్న వార్తలు చూపకపోయినా పర్లేదు కానీ దుష్ప్రభావాలు చూపే రిపొర్టింగ్ అందరి ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.