Begin typing your search above and press return to search.

30 సెకెన్ల ఈ వీడియో చూస్తే కన్నీళ్లుఆగవు.. డాక్టర్ల శ్రమకు దండాలు పెడతారు

By:  Tupaki Desk   |   24 April 2021 4:30 AM GMT
30 సెకెన్ల ఈ వీడియో చూస్తే కన్నీళ్లుఆగవు.. డాక్టర్ల శ్రమకు దండాలు పెడతారు
X
కరోనా మొదటి దశకు.. రెండో దశకు పోలికే లేదు. సర్వసన్నద్ధంగా ఉన్న వేళలో విరుచుకుపడే శత్రువును ఎదుర్కొనటం అదో లెక్క. అందుకు భిన్నంగా పాలకుల పట్టించుకోని వేళ.. అతివిశ్వాసంతో ప్రజలు పట్టించుకోకుండా ఉన్న వేళ.. కరోనా తన విశ్వరూపం ప్రదర్శించిన వేళ.. యావత్ దేశం మొత్తం అంతులేని విషాదంలో కూరుకుపోయింది. ఏ కుటుంబాన్ని కదిల్చినా.. వారింట్లోనో.. వారికి అత్యంత ఆత్మీయుల్లో ఎవరో ఒకరు కరోనా పాజిటివ్ బారిన పడటం.. వారి యోగక్షేమాలు తెలుసుకోవటంలోనే సరిపోతున్న పరిస్థితి.

ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటం లేదు.. ఆక్సిజన్ లేదు.. రెమిడెసివర్ లేదు.. ఇలా ఏదీ లేదన్న మాట వినిపిస్తున్న వేళ.. ఇంత భారీగా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బంది పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. కరోనా మొదటి వేవ్ వేళ.. ఇప్పుడున్నంత భారీగా రోగులు లేకపోవటం తెలిసిందే. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ.. తీవ్రత ఇంతలా అయితే లేదు. వాస్తవానికి కరోనా మొదటివేవ్ తొలినాళ్లలో ఆటలు..పాటలతో అదోలాంటి పరిస్థితి కనిపించేది.

ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. బెడ్ దొరకాలంటే.. ఎవరో ఒకరు చనిపోవాలన్నట్లుగా కొన్ని ఆసుపత్రులు ఉండటం.. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాలకుల అలసత్వం.. ప్రజల నిర్లక్ష్యం.. వెరసి విషాదం దేశం నలుమూలలా వెల్లువెత్తుతోంది. వైద్యసాయం కోసం వెల్లువెత్తుతున్న రోగులకు వైద్యం చేస్తున్న వారంతా తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. మధ్యలో విశ్రాంతి కోసం ఎలా తపిస్తున్నారో ఈ చిట్టి వీడియోలో చూస్తే అర్థమవుతుంది. పని చేసి.. చేసి అలిసిపోయి.. నిస్సత్తువు నిండిన వేళ.. కాసేపు కూలబడి..మళ్లీ విధి నిర్వహణ కోసం తయారవుతున్న తీరు చూస్తే.. కరోనాను మహమ్మారి అని ఎందుకు అంటారన్న విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఈ వీడియో చూశాక.. వైద్యులు.. వైద్య సిబ్బంది మీద గౌరవం పెరగటమే కాదు.. వారిని పల్లెత్తు మాట అనేందుకు మనసు ఒప్పని పరిస్థితి ఉంటుందని చెప్పక తప్పదు.