Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా కల్లోలం .. తాజా పరిస్థితులపై ప్రధాని వరుస భేటీలు !

By:  Tupaki Desk   |   23 April 2021 10:30 AM GMT
దేశంలో కరోనా కల్లోలం .. తాజా పరిస్థితులపై ప్రధాని వరుస భేటీలు !
X
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు కొవిడ్‌ సంబంధిత ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఉదయం 10 గంటలకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం 12.30గంటలకు దేశీయ ప్రముఖ ఆక్సిజన్‌ తయారీదారులతో సమావేశం అయ్యారు. గురువారం సైతం ఆక్సిజన్‌ సంక్షోభంపై ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ అన్ని రాష్ట్రాల్లోనూ సులభంగా లభ్యమయ్యే మార్గాలపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు.

ఇక, వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా, అడ్డంకులు లేకుండా జరిగేలా చూడాలని మోదీ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ఇంకా సరఫరాను పెంచడానికి వివిధ రకాలైన వినూత్న మార్గాలను కూడా అన్వేషించాలని ప్రధాని ఆయా మంత్రిత్వ శాఖలను కోరారు. దేశంలో కొవిడ్‌ అత్యవస పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం కొవిడ్‌-19 పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో శుక్రవారం బెంగాల్‌కు వెళ్లడం లేదని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌ విధానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడుతల పోలింగ్‌ పూర్తవగా.. ఈ నెలలో మరో రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. మే 2న ఫలితాలు విడుదలవనున్నాయి