Begin typing your search above and press return to search.

ఇప్పుడే ఇంత ఉంటే పీక్ లో ఎంత ఉంటుందో ?

By:  Tupaki Desk   |   15 April 2021 6:33 AM GMT
ఇప్పుడే ఇంత ఉంటే పీక్ లో ఎంత ఉంటుందో ?
X
కరోనా.. కరోనా.. మరోసారి కరోనా మహమ్మారి దేశాన్ని వణికిపోయేలా చేస్తుంది. సెకండ్ వేవ్ లో దేశంలో భారీగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రోజు నమోదు అయ్యే పాజిటివ్ కేసుల్ని బట్టి చూస్తే దేశంలో ఇదే ధోరణి లో కరోనా కొనసాగితే సెప్టెంబర్ నెల నాటి రికార్డును బద్దలు కొట్టే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం దేశంలో కరోనా ప్రవేశించినా.. ఆ తర్వాత రెండు నెలలకి కరోనా వేగం పుంజుకుంది. 2020 జనవరి 31న దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా , ఆ తర్వాత ఏప్రిల్ నెలలో విజృంభణ మొదలై , సెప్టెంబర్ నాటికి కరోనా కేసుల సంఖ్య పీక్ లెవెల్ ‌కు చేరింది. ఆ తర్వాత క్రమంగా కరోనా ప్రభావం తగ్గుతూ వచ్చింది. తిరిగి మళ్లీ 2021 ఫిబ్రవరి రెండో వారం నుంచి దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమై ప్రస్తుతం పీక్ లెవెల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

2020 జనవరి 31 దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా , ఆ తర్వాత కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతూ ఫిబ్రవరి నెలలో 6, మార్చిలో 1244 కేసులు మన దేశంలో రికార్డయ్యాయి. ఈ వ్యాధి తీవ్రత పెరిగిన క్రమంలో మార్చి చివరన దేశంలో లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత కూడా కరోనా విజృంభణ తగ్గలేదు. అలా సెప్టెంబర్ నెల నాటికి కరోనా పీక్ కి చేరింది. సెప్టెంబర్ నెలలో దేశంలో నెలలో ఏకంగా 26 లక్షల 4 వేల 518 మందికి కరోనా సోకింది. 33 వేల 28 మంది కరోనాతో చనిపోయారు. ఇక, అక్టోబర్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే అనూహ్యంగా 2021 మార్చి నుంచి దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యింది. మార్చిలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి 10 లక్షల మార్కును మరోసారి టచ్ చేసింది. మార్చి 2021లో 10 లక్షల 52 వేల 604 కరోనా పాజిటివ్ కేసులు నమోదై, 5 వేల 417 మరణాలు సంభవించాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు దేశంలో 15 లక్షల 40 వేల 118 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ లెక్కన గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్‌ లో పీక్ లెవెల్ లో వున్న సెప్టెంబర్ నాటి మార్కు 26 లక్షలను ప్రస్తుత నెలలో దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కోటి 36 లక్షల 89 వేల 453 మందికి కరోనా సోకింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 71 వేల 58గా నమోదైంది.

దేశంలో జనవరి 16 తేదీన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. జనవరిలో కేవలం ఫ్రంట్‌లైన్ వర్కర్ల కే వ్యాక్సిన్ ఇవ్వడంతో కేవలం 37 లక్షల 58 వేల 843 మందికి వ్యాక్సిన్ అందించారు. ఫిబ్రవరిలో కోటి 5 లక్షల 42 వేల 428 మందికి, మార్చిలో 5 కోట్ల 8 లక్షల 16 వేల 630 మందికి వ్యాక్సిన్ అందించారు. ఏప్రిల్ నెలలో 13వ తేదీ నాటికి 4 కోట్ల 60 లక్షల 61 వేల 682 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశ జనాభాలో 11 కోట్ల 11 లక్షల 79 వేల 578 మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. వ్యాక్సినేషన్ వేగవంతానికి కేంద్రం పక్కా చర్యలను చేపడుతోంది. ఇక ఇదిలా ఉంటే దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి వీర లెవెల్ లో పెరిగిపోతుంది. గతంలో ఉన్న అన్ని రికార్డులను అధిగమిస్తూ, రోజుకు రెండు లక్షలకు చేరువైంది. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 2,00,739 కాగా, 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసుల్లో 58,952 కేసులు మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ.