Begin typing your search above and press return to search.

లక్ష కేసులు వచ్చినా.. తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేదా?

By:  Tupaki Desk   |   12 April 2021 4:16 AM GMT
లక్ష కేసులు వచ్చినా.. తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది లేదా?
X
కేసులు పెరుగుతున్నాయి. ఊహించిన దాని కంటే వేగంగా వైరస్ వ్యాప్తి జరుగుతోంది. అంచనాలకు భిన్నంగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో కొత్త భయాలు వస్తున్నాయి. చూస్తుండగానే కేవలం రోజుల వ్యవధిలో రోజుకు అరవై వేల కేసుల స్థానే లక్షన్నర కేసులు దేశంలో నమోదవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. మరి.. ఎన్ని కేసుల వరకు తెలుగు రాష్ట్రాలు తట్టుకోగలవు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన ఒక లెక్కను వైద్యాధికారులు ఆసక్తికరంగా వివరిస్తున్నారు.

ఎవరిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ఈ మధ్యన మాట్లాడుతూ.. లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించే సత్తా తెలంగాణకు ఉందన్నారు. అదెలా సాధ్యం? అన్న సందేహం వస్తున్న వేళ.. అదే ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానం ఏమంటే.. లక్ష కేసులు వస్తే అందులో నాలుగైదు వేల మంది మాత్రమే ఆసుపత్రి పాలు అవుతారు. రోజు 50 వేల కేసులు వచ్చినా.. వారంలో 3.5 లక్షల పాజిటివ్ లు మాత్రమే అవుతారు. అందులో 15 వేల మంది మాత్రమే ఆసుపత్రి పాలవుతారు. అంత మందికి చికిత్స అందించే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

అదేసమయంలో వైరస్ మీద అవగాహన రావటం.. ఏ కసుకు ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై వైద్యుల్లో వచ్చిన అనుభవం పుణ్యమా అని ఎంతో క్రిటికల్ కేసులు తప్పించి.. మిగిలిన కేసులన్ని నాలుగైదు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిపోతున్నారు. గతంలో కనీసం పది నుంచి పదిహేను రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. ఈ మార్పుతో దవాఖానాల్లో బెడ్ల కొరత గతంలో మాదిరి ఉండదన్నది మర్చిపోకూడదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గతంలో వంద మందికి పాజిటివ్ వస్తే.. పది మందిఆసుపత్రి పాలు అయ్యేవారు. ఇప్పుడు.. ముగ్గురు..నలుగురు మాత్రమే ఆసుపత్రి పాలవుతున్నారు. మిగిలిన వారికి హోం ఐసోలేషన్.. వైద్యుల సలహాతో మందులు వాడితే సరిపోతోంది. కాబట్టి.. బెడ్ల కొరత తలెత్తే అవకాశం లేదు.ఇదంతా చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష చొప్పున కేసులు వచ్చినా.. ఇబ్బంది లేదనే చెప్పాలి. కాకుంటే.. ఇప్పుడున్న స్ట్రెయిన్ కు భిన్నమైనది వస్తే మాత్రం ఇబ్బందనే చెప్పాలి.