Begin typing your search above and press return to search.

ఏడాదిలో చనిపోయింది 20 లక్షలైతే.. 3 నెలల్లో మరణించింది అంతమందా?

By:  Tupaki Desk   |   8 April 2021 2:30 AM GMT
ఏడాదిలో చనిపోయింది 20 లక్షలైతే.. 3 నెలల్లో మరణించింది అంతమందా?
X
చాలామంది కరోనాను తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ.. ఈ మాయదారి మహమ్మారి మాత్రం చాలా సీరియస్ గా మనుషుల్ని చంపేస్తోంది. కంటికి కనిపించని ఈ వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కిందా మీదా పడే పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఏడాది వ్యవధిలో కరోనా కారణంగా చనిపోయిన వారు 20 లక్షలుగా తేల్చారు. విషాదకరమైన విషయం ఏమంటే.. గత ఏడాదిలో కరోనా మరణాలతో పోలిస్తే.. ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మరణాలకు అంతుపొంతు లేకుండా పోతోంది. సెకండ్ వేవ్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి అందరికి అందుబాటులోకి రాని పరిస్థితి. దీంతో.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకుకరోనా బారిన 13 కోట్ల మంది పడినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిల్లో అగ్రరాజ్యం అమెరికాలోనే మూడు కోట్ల కేసులు నమోదు కాగా.. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్.. భారత్ లు నిలిచాయి.

మరణాల్లో అమెరికా.. బ్రెజిల్ తొలి రెండుస్థానాల్లో ఉంటే మూడో స్థానంలో మెక్సికో నిలిచింది. కరోనా దెబ్బకు ఒక్క అమెరికాలోనే 5.5 లక్షల మంది మరణించగా.. తర్వాతి స్థానం బ్రెజిల్ లో ఉంది. ప్రపంచంలో మరణించిన ప్రతి నలుగురిలో ఒకరు బ్రెజిల్ పౌరులు కావటం గమనార్హం. యూరోపియన్ యూనియన్లలో అత్యధికంగా 11 లక్షల మంది మరణిస్తే.. యూరప్ లోని మొత్తం మరణాల్లో 60 శాతం యూకే.. రష్యా.. ఫ్రాన్స్.. జర్మనీలవే కావటం గమనార్హం. యూరప్ లో అత్యధికంగా 1.27లక్షలతో యూకే మొదటిస్థానంలో ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గత ఏడాదివ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మందిని కరోనా బలి తీసుకుంటే.. గడిచిన మూడు నెలల వ్యవధిలో కరోనా కారణంగా మరింత పెరిగాయి. మరణాల వేగం పెరిగినట్లుగా చెప్పాలి. సరైన సమయంలో తీవ్రతను గుర్తించకపోవటం కూడా మరణాలకు కారణంగా చెబుతున్నారు. కరోనా మరణాల వేగం ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. గడిచిన మూడు నెలల్లో 8.79 లక్షల మంది మరణించటం గమనార్హం. సో.. కరోనాను లైట్ తీసుకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయమన్న విషయాన్ని ఇకనైనా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.