Begin typing your search above and press return to search.

కొత్త రకం వైరస్.. ఇండియాలో డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రభావమెంత?

By:  Tupaki Desk   |   26 March 2021 4:30 PM GMT
కొత్త రకం వైరస్.. ఇండియాలో డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రభావమెంత?
X
కరోనా మహమ్మారి విజృంభణతో ఏడాది దాటినా ఆగలేదు. వైరస్ రూపాంతరం చెందుతూ కోరలు చాస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సేకరించిన డబుల్ మ్యూటెంట్ వైరస్ ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. కరోనా, స్ట్రెయిన్ కన్నా ఇది ప్రమాదకరమైందా? వ్యాక్సిన్ దీనిపై ప్రభావం చూపలేదా? అనే ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై నిపుణులు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోకి వ్యాప్తి చెందుతున్న క్రమంలో అనేక మార్పులకు గురవుతుంది. దీనినే మ్యూటేషన్ అంటారు. దీనిలో కొత్త లక్షణాలు ఏవీ ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగి మానవ శరీరంలోని ఇతర కణాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. ఇలాంటి వైరస్ చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా త్వరగా వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు. ఒక్కోసారి వ్యాక్సిన్ లూ వీటిపై ప్రభావం చూపలేవని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కొన్ని శాంపిళ్లలో తాజాగా ఈ కరోనా వైరస్‌లోని డబుల్‌ వేరియంట్‌ వైరస్‌ రకాన్ని నిపుణులు గుర్తించారు. మహారాష్ట్రలో సేకరించిన శాంపిల్స్‌లో E484Q, L452R మ్యూటేషన్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా వేరియంట్లు అయిన P.1, B.1.351లలో ఉన్నాయని.. ఇవి అనేక సార్లు మార్పు చెందాయని ఓ వైరాలజిస్టు తెలిపారు. ఈ మ్యూటేషన్‌లు క్రమంగా ప్రత్యేక తరగతి వైరస్‌లుగా మారి వాటి స్వభావాన్ని, ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. మనదేశంలో గుర్తించిన కొన్ని మ్యూటేషన్‌లు అమెరికాలోని కాలిఫోర్నియా వేరియంట్‌ను కూడా పోలి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి మ్యూటేషన్లు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయిని.. వైరస్ వ్యాప్తిని పెంచుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వైరస్ సరైన విధంగా మ్యుటేట్ అయితే ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ వైరస్ నుంచి ఇప్పటికే కోలుకున్నవారిలో రీ ఇన్ఫెక్షన్లు రావడం చాలా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ అత్యంత బలహీనంగా ఉన్న వారిని మరింత తీవ్రమైన వ్యాధులకు గురయ్యేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే కొత్తరకమైన ఈ డబుల్ మ్యూటెంట్ తో ప్రాణంతకంగా ఉండదని, సహజంగా వ్యాప్తి చెందదని అంటున్నారు. సెకండ్ వేవ్ కు ఈ మ్యూటెంట్ కారణం కాదు అని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుంది తప్పా మ్యూటెంట్ వల్ల కాదని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వైరస్ గురించి భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు. వైరస్ సోకినా ధైర్యంగా ఎదుర్కోగలగాలని చెబుతున్నారు.