Begin typing your search above and press return to search.

ఎంజాయ్ చేసే రోజులు అట్టే లేవా? కేసులతో ఆంక్షలు తప్పవా?

By:  Tupaki Desk   |   18 March 2021 12:30 PM GMT
ఎంజాయ్ చేసే రోజులు అట్టే లేవా? కేసులతో ఆంక్షలు తప్పవా?
X
కరోనాను జయించాం. మహమ్మారికి చుక్కలు చూపించాం. ప్రపంచ దేశాల్లో భారత్ కు మించిన గట్టి దేశం లేదు. భారతీయులకు మించిన తోపులు లేరు.. ఇలా ఎవరికి తోచినట్లు వారు.. ఎవరికి నచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేసుకోవటం చూశాం. కరోనా అన్నది జస్ట్ బ్రేక్ తీసుకున్నదే తప్పించి.. అది పూర్తిగా పోలేదన్న విషయం తాజాగా పెరుగుతున్న కేసుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దీనికితోడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ కరోనా ముప్పు గురించి గట్టి హెచ్చరికలే చేశారు.

వ్యాక్సిన్ వేస్టేజ్ మొదలుకొని.. నిర్దారణ పరీక్షల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించటంతో పాటు.. కరోనా విషయంలో అప్రమత్తంగా లేకుంటే తిప్పలు తప్పవన్న విషయాన్ని ఆయన చెప్పేశారు. గత ఏడాది మాదిరి లాక్ డౌన్ విధించేంత సీన్ లేకపోవటం.. అదే జరిగితే పలువురు ఉపాధి పోవటమే కాదు.. ఆర్థికంగా గడ్డు పరిస్థితి నెలకొంటుందన్న ఆలోచనతో పరిమితులతో అయినా పనులు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

అయితే.. ఆంక్షలు విధిస్తే తప్పించి మాట వినమన్నట్లుగా కొందరి తీరు.. కరోనా కేసులు పెరగటానికి కారణంగా చెప్పాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశుభ్రంగా ఉండటం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. చేతికి శానిటైజర్ వాడటం.. భౌతిక దూరాన్ని పాటించటం.. కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యల్నిచేపడితే సరిపోయే దానికి.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా వ్యవహరించటమే అసలు సమస్యగా చెప్పాలి.

దేశ ప్రధాని మోడీ.. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల గురించి ఆందోళన వ్యక్తం చేయటంతో పాటు.. తీసుకోవాల్సిన చర్యల గురించి ఫోకస్ చేయటం షురూ చేశారు. పెరుగుతున్న కేసుల గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అంతకంతకూ ఎక్కువ అవుతున్న పాజిటివ్ ల పుణ్యమా అని.. తెలంగాణలో స్కూళ్లు.. కాలేజీల విషయంలో రెండు మూడు రోజుల్లో ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికి ప్రజల్లో మార్పు రాకుంటే.. కేసుల తీవ్రత పెరిగే కొద్దీ.. ఆంక్షల కత్తిని ప్రభుత్వం బయటకు తీయటం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే.. లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తో వచ్చిన స్వేచ్ఛ మాయం కావటం ఖాయమని చెప్పాలి. ఇప్పుడున్న ఎంజాయ్ మెంట్ ను చేతులారా చెడగొట్టుకోవటం మన చేతుల్లోనే ఉందన్నది మర్చిపోకూడదు. అలా కాదు.. కూడదంటే.. 2020 ఏప్రిల్ ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో.. మళ్లీ అదే రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని చెప్పక తప్పదు.