Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని ఊపిరి తీసుకోనివ్వని జాదూ కరోనా!

By:  Tupaki Desk   |   3 March 2021 11:30 AM GMT
ప్రపంచాన్ని ఊపిరి తీసుకోనివ్వని జాదూ కరోనా!
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను నెలలు అవుతున్నా.. ఇప్పటికి ఒక కొలిక్కి రాని కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు కిందామీదా పడుతున్నాయి. ఒకపక్కన వ్యాక్సిన్ వచ్చినప్పటికి.. కేసుల సంఖ్యలో ఎలాంటి మార్పులు రాకపోవటమే కాదు.. అంతకంతకూ పెరుగుతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్.. ఫోర్త్ వేవ్ అంటూ వణికిపోయే పరిస్థితి.

సాధారణంగా ఏదైనా కొత్త వైరస్ వస్తే.. నాలుగైదు నెలల్లోనే మనుషుల్ని వదిలేస్తాయి. ఆలోపు సదరు వైరస్ తో పోరాడే లక్షణాలు వచ్చేస్తాయి. కరోనా విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉన్నా.. దానికున్న విచిత్రమైన వైఖరితో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనాను అధిగమించే యాంటీబాడీస్ పుట్టినప్పటికి.. తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మరో కొత్త రూపంలో విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు సమస్యగా మారింది.

వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త స్ట్రెయిన్లు వస్తుండటం.. వాటితో పోరాడే శక్తి లేకపోవటంతో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కరోనాజోరు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంది. ఏడు వారాలుగా కరోనా జోరు పెరిగినట్లుగా డబ్ల్యూహెచ్ఓ మరోసారి హెచ్చరించింది. బ్రిటన్ తరహా స్ట్రెయిన్ తో ఇండియాలో కేసులు పెరుగుతుంటే.. అమెరికాను మరోకొత్త స్ట్రెయిన్ ఇబ్బంది పెడుతోంది. ఇండియాలో ప్రస్తుతంమహారాష్ట్ర.. పంజాబ్ తో సహా నాలుగైదురాష్ట్రాల్లోకేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

ఇండియాలో రోజుకు అటుఇటుగా 12వేల కేసులు వస్తుంటే.. తెలంగాణలో తాజాగా 150-170 మధ్య కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. తాజాగా 106 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 3.51లక్షల కేసులు నమోదు కాగా.. ఒక్కరోజులో దీని బారిన పడి మరణించిన వారు 8967 మందిగా చెబుతున్నారు. అధికారిక లెక్కల్లోకి రాకుండా మరణాలు మరింత ఎక్కువ ఉండి ఉంటాయని చెబుతున్నారు. పాజిటివ్ కేసుల్లో అమెరికా తొలి స్థానంలో నిలిస్తే.. బ్రెజిల్.. రష్యా.. ఇండియా.. బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి.