Begin typing your search above and press return to search.

కరోనా - ఆర్థికలోటుపై గెలుపు ప్రజలదా? మోడీదా?

By:  Tupaki Desk   |   20 Jan 2021 12:30 PM GMT
కరోనా - ఆర్థికలోటుపై గెలుపు ప్రజలదా? మోడీదా?
X
కరోనా ధాటికి దేశమే బందీ అయిపోయింది. లాక్ డౌన్ తో అందరి ఉద్యోగ, ఉపాధి పోయింది. అయితే దేశాన్ని ఏలుతున్న ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని ఎవరకీ అక్కరకు రాని ప్యాకేజీగా నిలిచిపోయింది. అయితే ఆర్థిక లోటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కంటే ప్రజలు తమ ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రభుత్వానికి పరోక్షంగా ఆదాయాన్ని కల్పించారనేది వాస్తవం. ఈ విషయంలో ఉద్యోగ, వ్యవసాయ రంగాల కంటే అసంఘటిత రంగానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారు తమ ఆదాయాలను పెంచుకున్నా 54 శాతం తమ అవసరాల కోసం ఖర్చు చేశారు. అదే అసంఘటిత రంగానికి చెందినవారు 90 శాతం ఖర్చు చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడబెట్టారు. దీంతో భారత్ ను అ‘సంఘటితం’గా గెలిపించారని చర్చ సాగుతోంది.

భారత్ దశాబ్దాల కాలంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంటోంది. ఇందుకు దేశంలో ఉన్న పేదరికం, ఇతర కారణాలు కావచ్చు. ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం మార్చిలో కరోనా మహమ్మారి భారత్ లో ప్రవేశించి 10 నెలల పాటు అల్లకల్లోలం చేసింది. కరోనా వైరస్ అంతుకుముందు ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో విజ్రుంభించడంతో అవి తట్టుకోలేకపోయాయి. ఇక భారత్ ఎలా తట్టుకోగలదంటూ ఇక్కడి ప్రజలు భయాందోళన చెందారు. ఎలాగైతేనేం కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. కోటి మంది శరీరాల్లోకి ప్రవేశించింది. లక్షన్నర మందిని బలి తీసుకుంది.

కరోనా భారత్ లో ప్రవేశించగానే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరగకముందే లాక్ డౌన్ విధించింది. మూడు నెలల పాటు ఎన్నో కష్టాలను ప్రజలు అనుభవించారు. అయితే ఈ ప్రభావం అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, పేద ప్రజలపై ఎక్కువగా పడిందని చెప్పవచ్చు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు కూడా సంభవించాయి. ఇక వలస కార్మికుల సంగతి చెప్పనవసరం లేదు. ఉన్నచోట ఉఫాది లేక సొంతగ్రామానికి వెళ్లలేక ముప్పుతిప్పలు పడ్డారు.

ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవసాయ రంగాలపై ఈ ప్రభావం లేదని చెప్పలేము. కానీ వారికి ఎంతో కొంత ఆదాయం లభించింది. ఉద్యోగ రంగానికి చెందిన వారికి సగం జీతం లాంటి అవకాశాలు ఉన్నాయి. కొందరికి రుణ సదుపాయం కూడా లభించింది. ఇక మొదట్లో గ్రామాల్లో వైరస్ ప్రభావం లేనందన వ్యవసాయ రంగానికి చెందిన వారు వారి పనులను మెల్లగా సాగించారు. ఎటోచ్చి అసంఘటిత రంగానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నది వాస్తవం.

ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులతో పాటు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది. భారత్ లో 80 శాతం ప్రజలు అసంఘటిత రంగానికే చెందిన వారు కావడంతో వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ, రూ.10వేల రుణం లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సగటు పేదవారికి ఎంతవరకు చేరిందనేది చెప్పలేం.

అయితే దేశంలో లాక్డౌన్ సడలింపుల తరువాత అసంఘటిత రంగానికి చెందిన వారు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో మెల్లగా వారి ఆదాయాన్ని పెంచుకున్నారు. ఈ విషయంలో మిగతా రంగాల కంటే ఈ రంగానికి చెందిన వారు తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఆ తరువాత తమ అవసరాల కోసం ఖర్చులు చేశారు. అసంఘటిత రంగానికి చెందిన వారు 90శాతం తమ అవసరాల కోసం ఖర్చులు పెట్టారని ఓ సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వానికి పరోక్షంగా ఆదాయం లభించింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు 54 శాతమే ఖర్చు చేశారట. వారు తమ ఖర్చులను తగ్గించుకొని పొదుపు వైపు ఎక్కువగా ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది.