Begin typing your search above and press return to search.

నో డౌట్.. దేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగింది.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   5 Jan 2021 3:07 AM GMT
నో డౌట్.. దేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగింది.. అదెలానంటే?
X
బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్లు కళకళలాడుతున్నాయి. ఇక.. ప్రధాన రహదారుల మీద వాహనాల జోరు పెరిగితే.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్..సూపర్ మార్కెట్లు.. కూరగాయాల షాపులు.. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు.. ఇలా అవి ఇవి అన్న తేడా లేకుండా జనాలతో కళకళలాడిపోతున్నారు. ఇళ్లల్లో ఉండకుండా రోడ్ల మీదకు.. షాపింగ్ కోసం.. శుభకార్యాలు ఇలా వాటికి వీటికి అన్న తేడా లేకుండా జనం తెగ వెళుతున్నారు.

మరింత రద్దీగా ఉన్న వేళ.. కరోనా కేసులు మరెంత జోరుగా పెరగాలి. కానీ.. అందుకు భిన్నంగా పాజిటివ్ కేసులు తగ్గిపోవటం ఒక శుభవార్తగా చెప్పాలి. కరోనా కేసుల లెక్కలో సెకండ్ ప్లేస్ లో ఉన్న కరోనా కేసులు తాజాగా భారీగా తగ్గుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. వేగవంతంగా పెరిగిన కేసులతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఒక దశలో భారీగా నమోదయ్యాయి. రోజులో లక్షకు దగ్గరగా (97,894) వచ్చిన దుస్థితి. దీంతో.. రానున్న రోజులు మరెంత దారుణంగా ఉంటాయన్నది అప్పట్లో ప్రశ్నగా ఉండేది.

లక్కీగా ఇప్పుడు కేసులు భారీగా తగ్గిపోయాయి. జనవరి నాలుగున విడుదలైన బులిటెన్ ప్రకారం దేశంలో నమోదైన కేసులు 16,504 మాత్రమే. ఎక్కడ 97వేలు.. ఎక్కడ 16వేలు? వాస్తవానికి ఇప్పుడు నడుస్తున్నది చలికాలం. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కూడా కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగేలా చేసే పరిస్థితి.ఇలాంటి వేళలోనే తక్కువ కేసులు నమోదు కావటం అంటే.. కచచ్ఛితంగా హెర్డ్ ఇమ్యూనిటీ దేశ ప్రజలకు పెరిగినట్లుగా చెప్పక తప్పదు. కేసుల నమోదు చూస్తే.. కచ్ఛితంగా ఇది తగ్గుదలే అని అశోక వర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ షాహిద్ జమీల్ చెబుతున్నారు.

ఏదో మాట వరసకు చెప్పినట్లు కాకుండా అందుకు తగిన ఉదాహరణలు కూడా చెబుతున్నారు. జనాభా అధికంగా ఉన్న మహానగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ముందు ఉంటుంది. కరోనా కేసుల నమోదు తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు ఆరు వేలకు పైనే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా 384 కేసులు మాత్రమే నమోదు కావటం గమనార్హం. ఇలాంటి పరిస్థితికి కారణం హెర్డ్ ఇమ్యూనిటీ కూడా కావొచ్చంటున్నారు. లోకల్ హెర్డ్ ఇమ్యూనిటీ ప్రజల్లో పెరగటమే కేసుల నమోదు తగ్గుతుందని చెప్పాలి. భారత్ లో వైరస్ తీవ్రత తగ్గటానికి మరో కారణం.. దేశంలో అత్యధికంగా ఉన్న యువ జనాభా. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లకు లోబడిన వారే కావటం కూడా హెర్డ్ ఇమ్యునిటీ పెరగటానికి సాయం చేసిందని చెబుతున్నారు. ఈ కారణంతోనే కేసుల నమోదు బాగా తగ్గినట్లుగా చెప్పాలి. ఏమైనా చాలా దేశాలతో పోలిస్తే.. మన దేశ ప్రజలు బాగా లక్కీ అని చెప్పాలి.