Begin typing your search above and press return to search.

కొత్త డౌట్: మొదట వేసేది కోవిషీల్డ్.. మరి కోవాగ్జిన్ వచ్చేదెప్పుడు?

By:  Tupaki Desk   |   4 Jan 2021 5:30 AM GMT
కొత్త డౌట్: మొదట వేసేది కోవిషీల్డ్.. మరి కోవాగ్జిన్ వచ్చేదెప్పుడు?
X
కీలక నిర్ణయం తీసుకున్నంతనే వాటిని పీకి పాకం పెట్టి.. రాజకీయం చేసేంతవరకు రాజకీయ నేతలు నిద్రపోరా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఆదివారం దేశంలోని రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఓకే చెబుతూ అనుమతులు జారీ చేయటం తెలిసిందే. ఫూణెకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ ను మొదట వేయనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన టీకా ఇప్పటికిప్పుడు బయటకు రాదన్న మాట వినిపిస్తోంది.

ఈ తరహా వాదనకు బలం చేకూరేలా కొన్ని అభిప్రాయాలు బయటకు రావటంతో.. కోవాగ్జిన్ ను ఇప్పటికిప్పుడు వినియోగించే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వటాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టటం.. పూర్తిస్థాయి పరీక్షలు అయ్యాక దాన్ని వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పై చోటు చేసుకుంటున్న హాట్ వ్యాఖ్యలపై ఎయిమ్స్ డైరెక్టర్.. జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్ దీప్ గులేరియా స్పందించారు. కోవాగ్జిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్.. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని.. దేశ వ్యాప్తవ్యాక్సినేషన్ తొలిదశలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ (ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించినవి) టీకానే వాడతాం. దీని పని తీరు ఏ మేరకు ఉందన్నది తెలీదు. కోవిషీల్డ్ పని తీరు ఏ మేరకు పని చేస్తుందన్నది ఇంకా పూర్తిస్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే.. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ కు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ను వాడుకోవచ్చు’ అని పేర్కొన్నారు. దీంతో.. తొలుత వేసేది కోవిషీల్డ్ వ్యాక్సిన్ అని.. దాని విషయంలో తేడాలు వస్తే.. కోవాగ్జిన్ వాడే అవకాశం ఉందన్న విషయం అర్థమవుతుంది. మాటలు ఈ రకంగా ఉండి.. చేతల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.