Begin typing your search above and press return to search.

కరోనా స్ట్రెయిన్: దేశంలో పెరుగుతున్న కేసులు.. ప్రభుత్వ చర్యలు ఇవే..

By:  Tupaki Desk   |   31 Dec 2020 9:30 AM GMT
కరోనా స్ట్రెయిన్: దేశంలో పెరుగుతున్న కేసులు.. ప్రభుత్వ చర్యలు ఇవే..
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ (బీ117) వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్లో వేలాదిగా నమోదువుతున్న కేసులతో ఆ దేశం లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే కొవిడ్-19తో అల్లాడుతున్న అమెరికాతోపాటు చాలా దేశాల్లోకి స్ట్రెయిన్ ఎంటరైంది. దీంతో.. ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. వేగంగా స్పందిస్తూ తగిన చర్యలు చేపడుతున్నాయి.

ఇండియాలో ఇదీ పరిస్థితి..
మన దేశానికి సంబంధించి ఇప్పటి వరకూ 20 స్ట్రెయిన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నాటక రాష్ట్ర రాజధానికి బెంగలూరులోనే 7 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ఒకే కుటుంబంలో ముగ్గురు స్ట్రెయిన్ బారిన పడ్డారు. కాగా.. కొత్త కరోనా వైరస్ బయటపడ్డ తర్వాత యూకే నుంచి 33 వేల మంది ఇండియాకు తరలివచ్చారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ నుంచి వివరాలు సేకరించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిని ట్రేస్ చేస్తున్నాయి. అయితే.. ఇంకా పలువురి జాడ తెలియాల్సి ఉంది.

న్యూఇయర్ వేడుకలు నిషేధం..
కొవిడ్-19 కన్నా కరోనా స్ట్రెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోంది. దీంతో.. రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. జనాలను గుంపులుగా ఉండొద్దని, మాస్కు లేకుండా తిరగొద్దని ఆదేశాలు జారీచేస్తున్నాాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేడుకలను కూడా రద్దు చేశాయి. కర్నాటక ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను రద్దుచేసి, పలు ప్రాంతాలను నో మెన్ జోన్ గా ప్రకటించింది. 144 సెక్షన్ విధించింది. కేరళ ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించింది. రాత్రి పది గంటల వరకే బయట తిరగడానికి పర్మిషన్ ఇచ్చింది. మాస్కులు కంపల్సరీ చేసిన ప్రభుత్వం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హర్యానాలో బానా సంచా నిషేధించిన ప్రభుత్వం.. న్యూ ఇయర్ వేడుకలను కూడా రద్దు చేసింది. ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రం లేఖ కూడా రాసింది. డిసెంబర్ 31, జనవరి1 వ తేదీల్లో న్యూ ఇయర్ సందర్భంగా జనాలు గుమిగూడే అవకాశం ఉందని, అందువల్ల ఆంక్షలు విధించాలని, మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్, అబర్బన్ ప్రాంతాలపై కన్నేయాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రెండు, ఏపీ ఒక కేసు బయటపడ్డాయి. అయితే.. తాజాగా హైదరాబాద్, వరంగల్, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లో అనుమానితులు నమోదయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు జారీచేశాయి. రాత్రివేళ ఎవరూ గుంపులుగా ఉండొద్దని ఆదేశించాయి.

టీకా పరిస్థితి ఏంటి..?
కరోనా స్ట్రెయిన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాలు టీకా వినియోగంపై అత్యవసర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రెజినికా టీకాకు ఆమోదం తెలిపింది. ఇక, అర్జెంటీనా షీకోల్డ్ టీకా వినియోగానికి పర్మిషన్ ఇచ్చింది. భారత్ లో మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్రం వద్ద మూడు టీకాలకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సీరం ఇన్సిస్టిట్యూట్, భారత్ భయోటెక్, ఫైజర్ కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లలో వేటికి అనుమతి ఇవ్వాలి? ఏవి ప్రభావశీలంగా ఉన్నాయి? అనే అంశంపై ఇప్పటికే మొదటి దఫా సమావేశం పూర్తయింది. రేపు మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ అనుమతులు ఎప్పుడు వచ్చినా సత్వరమే అందించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే 15 లక్షల సిరంజీలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. జనవరి రెండు లేదా మూడో వారంలో వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నవంబర్లోనే ఇండియాకు స్ట్రెయిన్..?
కాగా.. కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ఇంతకు ముందే వచ్చి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా సందేహం వ్యక్తంచేశారు. బ్రిటన్ లో కొవిడ్-19 వైరస్ తన రూపం మార్చుకునే ప్రక్రియ సెప్టెంబర్లోనే మొదలైందని, ఆ విధంగా చూసుకుంటే.. నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లోనే ఈ స్ట్రెయిన్ ఇండియాలోకి వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే.. ఇప్పటికే కనుగొన్న వ్యాక్సిన్లపై ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని గులేరియా అన్నారు.