Begin typing your search above and press return to search.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పది రోజుల్లో ముప్పు అంత ఎక్కువట

By:  Tupaki Desk   |   17 Dec 2020 3:31 AM GMT
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పది రోజుల్లో ముప్పు అంత ఎక్కువట
X
వణికించే కరోనా తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గతంలో మరే వైరస్ గురించి తెలియనంత ఎక్కువగా.. ఈ తరానికి కరోనా గురించి అవగాహన వచ్చిందని చెప్పాలి. ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసిన ఈ మహమ్మారికి సంబంధించి చాలా తెలుసన్నప్పటికీ.. మరిన్ని విషయాల మీద చాలామందికి అవగాహన లేదనే చెప్పాలి. తాజాగా జరిపిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. అందులో ముఖ్యమైనది.. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరి.. చికిత్స చేయించుకున్న వారు మిగిలిన వారి కంటే చాలా కేర్ ఫుల్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

కరోనా కారణంగా అస్వస్థతకు గురైన వారు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి.. ఇంటికి వచ్చిన తర్వాత మొదటి పది రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనాతో ఏ మాత్రం సంబంధం లేని నిమోనియా.. గుండె వైఫల్యం సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఇతర రోగులతో పోల్చి చూసిన సందర్భంగా కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

కోవిడ్ బాధితులు డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆసుపత్రి పాలు కావటానికి లేదా మరణించటానికి ఉన్న అవకాశాల్ని పరిశీలించగా.. అలాంటివారు 40 నుంచి 60 శాతం వరకు ఉంటారని గుర్తించారు. అదే సమయంలో 60 రోజుల తర్వాత మాత్రం గుండె వైఫల్యం.. నియోనియా బాధితులతో పోలిస్తే.. కరోనా బాధితులకు ఈ రెండు రకాల ముప్పు బాగా తక్కువని తేల్చారు.

మొదటి రెండు నెలల్లో కొవిడ్ బాధితుల్లో 9 శాతం మంది మరణించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. మళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రికి చేరిన వారు 20 శాతం మేర ఉన్నట్లుగా తేలింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఆసుపత్రుల్లో ఉండగా మరణించిన వారు 18.5 శాతమని తేలింది. ఇదంతా చూసినప్పుడు కరోనా సోకిన అందరూ ఒకేలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం లేదన్నదే కాదు.. తీవ్రత ఎక్కువగా ఉన్నవారు.. ఆసుపత్రిలో చేరి డిశ్చార్జి అయిన వారు.. మిగిలిన వారి కంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుందని చెప్పక తప్పదు.