Begin typing your search above and press return to search.

భయం.. భయం.. కేసులు తగ్గినా ‘కరోనా’ పేరు వింటేనే వణికిపోతున్న జనం..

By:  Tupaki Desk   |   4 Nov 2020 5:45 AM GMT
భయం.. భయం..  కేసులు తగ్గినా ‘కరోనా’ పేరు వింటేనే వణికిపోతున్న జనం..
X
కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. వ్యాధి బారినపడ్డ వారు కూడా తొందరగానేకోలుకుంటున్నారు. ఇదిగో వ్యాక్సిన్​.. అదిగో మెడిసిన్​ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో కరోనా సృష్టించన భయం ఇంకా పూర్తిగా పోలేదు. ఈ కరోనా మనకు ఏం సోకదు అంటూ కొందరు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరికొందరేమో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చాలామంది కరోనా భయంతో మానసికంగా కుంగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. తమ దగ్గరి వాళ్లకు కరోనా సోకిందని తెలిసినా.. తమ పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిసినా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో వారు రోజురోజుకూ మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.

పైకి కొంత గంభీరంగా కనపడుతున్నా లోలోపల మాత్రం కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత మార్చి నుంచి కొందరైతే ఇండ్లకే పరిమితమయ్యారు. అటువంటి వారి మానసిక పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు కోవిడ్‌ బారిన పడినవారు దాని దుష్ప్రభావాల నుంచి తేరుకునే క్రమం లో ఇంకా ఆరోగ్య పరమైన సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దీనిపై మానసిక నిపుణులు ఏమంటున్నారంటే.. కరోనాకు ఇప్పట్లో ‘ఎండ్‌ పాయింట్‌’అనేది కనిపించడం లేదు. చాలా మంది కరోనా వచ్చి తగ్గాక పలువురు ఆరు వారాలకు మించి ‘యాంగ్జయిటీ, డిప్రెషన్‌’లను ఎదుర్కొంటున్నారు. కొంచెం దగ్గు, జలుబు చేసినా ఆందోళన పడేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొందరేమో అతి జాగ్రత్తలు తీసుకుంటుంటే మరి కొందరేమో విచ్చల విడిగా తిరిగి వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నారు.

50 నుంచి 60 శాతం మందే మాస్క్‌ లు ధరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం మినహా మరో మార్గం లేదు. కరోనా మహమ్మారి చాలా కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఎగువ మధ్యతరగతి, ఉన్నత కుటుంబాల వాళ్లు కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటున్నారు. కానీ పేద ప్రజలు, చిరు వ్యాపారాలు చేసుకొనే మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ మహమ్మారి దాటికి తట్టుకో లేకపోతున్నారు. వారు ఆర్థికంగా నష్ట పోవడంతో మానసికంగా కుంగి పోతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు వెతుక్కోవడం.. మానసిక దృఢత్వం కోసం యోగా, వ్యాయామాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.