Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వచ్చినా వారు మాత్రం 2022 వరకూ ఆగాల్సిందే : డబ్ల్యూహెచ్ వో

By:  Tupaki Desk   |   16 Oct 2020 6:45 AM GMT
వ్యాక్సిన్  వచ్చినా వారు  మాత్రం 2022 వరకూ ఆగాల్సిందే : డబ్ల్యూహెచ్ వో
X
వచ్చే ఏడాది ఆరంభంకల్లా ప్రపంచంలో ఏదో ఒక దేశం వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తుందని..అయితే ఆ వ్యాక్సిన్ ను అందరికీ ఒకేసారి పంపిణీ చేయడం కుదరదని.. ఎవరెవరికి అత్యవసర అవసరమో వారికి మాత్రమే వేయనున్నట్లు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. మిగతా వారంతా 2022 వరకు ఆగాల్సిందేనని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్షలాదిగా నమోదు అవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు.కొన్ని దేశాలు రెండు, మూడో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

మన దేశంలో భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసే వ్యాక్సిన్ తో పాటు మొత్తం ఐదు వ్యాక్సిన్లు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని వచ్చే ఏడాది జనవరికల్లా ఒక్కటైనా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చైనా, అమెరికా, రష్యా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని తొందర్లోనే వ్యాక్సిన్ తేనున్నాయి. రష్యా ఇది వరకే ఓ వ్యాక్సిన్ తెచ్చినా అది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో దానిపైన దృష్టి పెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారినపడగా వైద్యులు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ ఇచ్చి కోలుకునేలా చేశారు.

యువతకు మాత్రం 2022లోనే టీకా

ఈ నేపథ్యంలో 2021 ఆరంభాన్ని కల్లా ప్రపంచంలో ఏదో ఒక దేశం వ్యాక్సిన్ తయారు చేస్తుందని డబ్ల్యూహెచ్ వో అంచనా వేస్తోంది. అయితే ప్రపంచ జనాభా అంతటికీ ఒక్కసారిగా వ్యాక్సిన్ వేయడం అసాధ్యం. అన్ని వందల కోట్ల టీకాలు ఉత్పత్తి చేయడానికి చాలా కాలం పడుతుంది. అందుకే ముందుగా సిద్ధం అయ్యే వ్యాక్సిన్ ను వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే టీకా వేయనున్నట్లు డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. ఆరోగ్యకరమైన యువత టీకా కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. వీరందరికీ వేసిన తర్వాతే యువతకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది.