Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్ : 90వేలు దాటిన మరణాలు , ఒక్కరోజే లక్షకు పైగా రికవరీలు

By:  Tupaki Desk   |   23 Sep 2020 5:15 AM GMT
లేటెస్ట్ అప్డేట్ :  90వేలు దాటిన మరణాలు , ఒక్కరోజే  లక్షకు పైగా రికవరీలు
X
కరోనా మహమ్మారి రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కరోనా మహమ్మారి విషయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా కేసులు నెమ్మదించగా... ఇండియాలో మాత్రం భారీ సంఖ్యలో రోజూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా... 83,347 కేసులొచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,46,010కి చేరింది. గత 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,75,861 గా ఉంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 17.54 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్‌ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం మరో 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్‌ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ ఉన్నాయి.