Begin typing your search above and press return to search.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్..ఎయిమ్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Sep 2020 6:00 AM GMT
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్..ఎయిమ్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X
భారత్ లో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకి కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా గత నెల రోజులుగా ప్రతిరోజూ కూడా భారత్ లో ఎక్కువ కరోనా మహమ్మారి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో ఎయిమ్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్‌ లో కరోనా వైరస్ 2021 లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా మహమ్మారి 2021 వరకూ ఉండదని చెప్పేందుకు లేదు. అయితే కేసుల సంఖ్య భారీగా కంటే నిలకడగా ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ మళ్లీ ప్రారంభం కావడం చూస్తున్నామని, ఇది ఒక రకంగా కరోనా సెకండ్ వేవ్‌ అని గులేరియా చెప్పారు. అయితే, ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. కరోనా వచ్చిన మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకునేవారని, ఇప్పుడు కొంచెం లైట్ తీసుకున్నారని అన్నారు. కేసులు తిరగబెట్టడానికి ఇదో ముఖ్య కారణమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రజలు మాస్కులు ధరించడం లేదన్నారు. గతంలో మాదిరి మళ్లీ గుంపులుగా చేరుతున్నారని, ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయాయని.. ఒక రకంగా ప్రీ-కరోనా రోజులు వచ్చేశాయని , దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఇవే కారణమంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో చాలాచోట్ల రీఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని, దానికి భయపడాల్సిన అవసరం లేదని, ఒక్కసారి కరోనా వైరస్ పేషెంట్‌ లో యాంటీబాడీస్ అభివృద్ది చెందితే, 3 నుంచి 6 నెలల వరకూ తిరిగి అతను కరోనా బారినపడకుండా ఉండే అవకాశం ఉన్నట్లు డేటా చెబుతోందన్నారు.

ఇక, అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్ భారత్‌ లో అందుబాటులోకి రావచ్చునని అన్నారు. ప్రస్తుతం భారత్‌ లో మూడు వ్యాక్సిన్లు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని, అయితే ఏ వ్యాక్సిన్ అయినా... అది ఎంత సేఫ్ అన్నదే ముఖ్యమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పడానికి ముందు, పెద్ద ఎత్తున ట్రయల్స్ జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు.