Begin typing your search above and press return to search.

కరోనా కాటుకు పిల్లల్లో సరికొత్త సమస్యలు

By:  Tupaki Desk   |   21 Aug 2020 12:30 AM GMT
కరోనా కాటుకు పిల్లల్లో సరికొత్త సమస్యలు
X
కరోనా బారిన పడుతున్న వారిలో పిల్లలతో పోలిస్తే పెద్దలే అధికంగా ఉంటున్నారు. పెద్దలకు అధికంగా ఊపిరితిత్తులకు సంబంధించి, గుండెకు సంబంధించి సమస్యలు ఉండడం, కొందరు దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బందులు పడుతుండటంతో అలాంటి వారికి కరోనా వస్తే తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలతో పోలిస్తే పెద్దలకే సమస్య అధికంగా ఉండడంతో ఎక్కువగా పెద్దలకు వచ్చిన కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం. శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా ఆ విధంగానే సాగుతున్నాయి. అయితే కరోనా పిల్లల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తాజాగా వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. కరోనా సోకిన పిల్లల్లో పీడీయాట్రిక్ ఇన్ ఫ్లమేటరీ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ (పీఐఎంఎస్ -టీఎస్) అనే అరుదైన సమస్య వస్తోందని లండన్ లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా సోకిన పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ ఎలా మారుతుంది అనే అంశంపై వారు పరిశోధనలు సాగించారు. బాధిత పిల్లల రక్తనాళాల్లో వాపు పెరిగి గుండె పనితీరు పై ప్రభావం పడుతోందని వారు గుర్తించారు. కరోనా వచ్చిన 25 మంది పిల్లల రక్తనమూనాలను పరీక్షించగా.. వారిలో కరోనా లక్షణాలతోపాటు పీఐఎంఎస్ -టీఎస్ లక్షణాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు కరోనా సోకిన తల్లిదండ్రుల వద్ద ఉన్న పిల్లలు, పూర్తి ఆరోగ్యంగా ఉన్న పిల్లల ఫలితాలతో పోల్చి చూశారు. పీఐఎంఎస్ -టీఎస్ లక్షణాలు ఉన్న పిల్లల్లో సైకోటైన్లు పెరిగి వ్యాధి నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి రోగనిరోధక వ్యవస్థలో కూడా ప్రమాదకరమైన మార్పులు కూడా వచ్చినట్లు వెల్లడించారు. శరీరమంతా రక్తనాళాలు ఎర్రబడే కవసాకి వ్యాధి తరహా లక్షణాలు కరోనా బారిన పడ్డ పిల్లల్లో గుర్తించినట్లు కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఒక్కసారి పిల్లలు కరోనా నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాత వారి రోగనిరోధక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు.