Begin typing your search above and press return to search.

దేశంలో 200 రోజులు పూర్తిచేసుకున్న కరోనా మహమ్మారి !

By:  Tupaki Desk   |   17 Aug 2020 6:15 AM GMT
దేశంలో 200 రోజులు పూర్తిచేసుకున్న కరోనా మహమ్మారి !
X
కరోనా వైరస్ .. ఈ పేరు వినిపిస్తే ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికీ సోకుతుందో , ఎలా సోకుతుందో తెలియదు. అసలు మన పక్కవారిని , మన ఇంట్లోని వారిని కూడా నమ్మలేని పరిస్థితి. కరోనా మహమ్మారి భారత్‌ పై పంజా విసిరి 200 రోజులైంది. ఈ ఆరునెలల కాలంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ప్రపంచం లో మూడో స్థానానికి చేరుకున్నాం. కేసుల పెరుగుదల భయపెడుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో రికవరీ భారత్‌ సాధించిన అద్భుత విజయం గా చెప్పవచ్చు.

కేరళలో జనవరి 30న తొలి కేసు నమోదైనప్పటి నుండి నేటివరకు ఇప్పటి వరకు కేంద్రం , దేశంలో అన్ని రాష్ట్రాలతో కలిసి పక్కా ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తోంది. మోదీ సరైన సమయంలో స్పందించి మార్చి 25 నుంచి లాక్‌ డౌన్‌ విధించడంతో దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరగకుండా అడ్డుకోగలిగారు. అయితే , లాక్ డౌన్ ను మరిన్ని రోజులు కొనసాగిస్తే ఆకలి చావులు , ఆర్థిక పరిస్థితి ఎక్కువై పోతోంది అని భావించి .. మే 3 నుంచి లాక్‌ డౌన్‌పై ఆంక్షలు సడలించడం తో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అలా ఈ 200 రోజుల్లోనే కేసుల సంఖ్య 26 లక్షలకి చేరుకుంది. మొత్తం కేసుల్లో 92% లాక్‌డౌన్‌ తర్వాతే నమోదు కావడం గమనార్హం.

అయితే , కరోనా రికవరీ విషయంలో భారత్‌ ప్రపంచంలోనే ముందుంది. ఏప్రిల్‌లో 26% మాత్రమే ఉన్న రికవరీ రేటు ఆగస్టు నాటికి 72శాతానికి పెరిగింది. మొత్తం దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి మృతుల సంఖ్య 50 వేలు దాటినప్పటికీ మరణాల రేటు 1.9% ఉండడం భారీగా ఊరటనిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలి మరణం నమోదైన 23 రోజుల్లోనే 50 వేల మంది ప్రాణాలు కోల్పోతే భారత్‌కి తొలి మరణం నుంచి 50 వేలకు చేరుకోవడానికి 156 రోజులు పట్టింది. దీన్ని అరికట్టడానికి చాలా దేశాల్లో వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరా బాద్‌ కేంద్రంగా పనిచేసే భారత్‌ బయోటెక్, అహ్మదాబాద్‌లోని జైడస్‌ కేడిలా లిమిటెడ్‌ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి.

ప్రపంచంలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం 23% భారత్‌ లోనే నమోదవుతున్నాయి. ప్రతీ 10 లక్షల మందిలో 1857 మందికి కరోనా వైరస్‌ సోకుతోంది. 25 లక్షలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత భారత్‌ నిలిచింది. ఇదే తరహా లో మరికొన్ని రోజులు కొనసాగితే ఈ ఏడాది చివరికి కోటికి పైగా కేసులు నమోదవుతాయని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మృతుల సంఖ్య 1.74 లక్షల వరకు చేరే అవకాశం ఉందట. దేశంలో మొదట్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు కోవిడ్‌ హాట్ ‌స్పాట్ ‌లుగా ఉంటే ఇప్పుడు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. సెప్టెంబర్‌ రెండో వారానికి కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఇకపోతే , దేశవ్యాప్తంగా 1433 ల్యాబొరేటరీల్లో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాట క, పశ్చిమ బెంగాల్‌ లో అత్యధికంగా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకి 8 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకి 10 లక్షల టెస్టులు జరపాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇకపోతే , ఇప్పటివరకు 2.9 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌ కేసులు 9% నమోదయ్యాయి. ఏదేమైనా ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. కాబట్టి పని ఉంటే మాత్రమే బయటకి వెళ్తూ కరోనా భారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన భాద్యత మనదే .