Begin typing your search above and press return to search.

కరోనా : అమెరికా, బ్రెజిల్‌ ను దాటేసిన ఇండియా !

By:  Tupaki Desk   |   12 Aug 2020 7:50 AM GMT
కరోనా :  అమెరికా, బ్రెజిల్‌ ను దాటేసిన ఇండియా !
X
కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ముఖ్యంగా భారత్ లో కరోనా జోరు ఉదృతంగా కొనసాగుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 60963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రతి నిమిషానికీ 42 కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2329638కి చేరింది. గత 24 గంటల్లో 834 మంది చనిపోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 46091కి చేరింది.

దీన్ని బట్టి చూస్తే .. కరోనా అత్యంత ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఇండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే, అమెరికా, బ్రెజిల్‌ తో పోలిస్తే ఒక రోజులో నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య భారత్‌ లోనే ఎక్కువగా ఉన్నట్లు నమోదు అయ్యే కేసుల్ని బట్టి స్పష్టం అవుతుంది. గత వారం రోజులుగా భారత్ లో రికార్డు స్థాయిలో 4,11,379 మంది కరోనా బారిన పడగా.. 6,251 మంది కరోనా కారణంగా మరణించారు. ఇదే సమయంలో అమెరికాలో 3,69,575 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,232 కరోనా మరణాలు సంభవించాయి. అలాగే , బ్రెజిల్‌ విషయానికి వస్తే 3,04,535 మందికి వైరస్‌ సోకగా.. 6,914 మంది కరోనా‌తో మృతి చెందారు. అయితే గత నాలుగు రోజులుగా దేశంలో వరుసగా 60 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు. దేశంలో కొత్త కేసులు భారీగా నమోదు అవుతున్నా కూడా రికవరీ కూడా అదే స్థాయిలో అవుతున్నారు.

అమెరికా, బ్రెజిల్ దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా మన దేశంలో తక్కువగానే ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 16 లక్షలకు చేరువైనట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. మరణాల రేటు 1.99 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. అయితే ఇక్కడ మరో విషయాన్ని గమనించాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్‌ తో పోలిస్తే కరోనా టెస్టుల విషయంలో మాత్రం భారత్‌ వెనుకనే ఉంది. అమెరికాలో 1 మిలియన్‌ జనాభాకు 1,99,803 మందికి , బ్రెజిల్‌లో 1 మిలియన్ జనాభాకి 62,200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా... భారత్‌ లో మాత్రం ప్రతీ పది లక్షల మందిలో కేవలం 18, 300 మందికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు.