Begin typing your search above and press return to search.

కోవిడ్ ఎఫెక్ట్.. మనోళ్లకు బంగారం మీద మోజు తగ్గేలా చేసిందట

By:  Tupaki Desk   |   31 July 2020 5:00 AM GMT
కోవిడ్ ఎఫెక్ట్.. మనోళ్లకు బంగారం మీద మోజు తగ్గేలా చేసిందట
X
ఎలాంటి పరిస్థితులున్నా దేశంలో బంగారం డిమాండ్ కు ఉండే మోజు తగ్గదు. ఆర్థిక సంక్షోభంతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుందన్న మాట ఓవైపు వినిపిస్తుంటే.. మరోవైపు దేశంలోని బంగారం దుకాణాలు సూపర్ మార్కెట్లను తలపించేలా దర్శనమిస్తాయి. అంతేనా.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ మందగమనంలో సాగిందన్న హెచ్చరికలు జారీ అయిన వేళలోనూ బంగారం కొనుగోళ్లు.. దిగుమతులు తగ్గలేదు. ఇలా పరిస్థితులు ఏమైనా.. బంగారం మీద ప్రజలకుండే మోజు.. కొనుగోలు చేసేందుకు ప్రదర్శించే ఆసక్తి ఎప్పుడూ తగ్గింది లేదు.

అలాంటిది తాజాగా నెలకొన్నకరోనా పరిస్థితుల పుణ్యమా అని మొదటిసారి బంగారం కొనుగోళ్లలో మోజు తగ్గినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా విదేశాల నుంచి భారీగా బంగారం దిగుమతులు తగ్గటం గమనార్హం. బంగారాన్ని కొనే విషయంలో ప్రజలెంత వెనకుడుగు వేస్తున్నారన్న దానికి నిదర్శనంగా కొన్ని గణాంకాల్ని ప్రస్తావిస్తున్నారు.

గత ఏడాది ఏప్రిల్ - జులై త్రైమాసికంలో 247.4 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు) ఉంది. మరి.. ఈ ఏడాది ఇదే మూడు నెలల కాలానికి విదేశాల నుంచి దిగుమతి అయిన బంగారం ఎంతో తెలుసా? అక్షరాల 11.6 టన్నులు మాత్రమే. అంటే.. గత ఏడాదిలో జరిగిన దిగుమతుల్లో 95 శాతం లేకపోవటం షాకింగ్ గా మారటమే కాదు.. దేశంలో బంగారం కొనుగోళ్లు ఎంత భారీగా తగ్గిపోయాయన్నది ఇప్పుడు కళ్లకు కట్టేలా కనిపిస్తోంది.

తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం దేశంలో ఇప్పుడు విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయని చెబుతున్నారు. వివాహాలు వాయిదా పడటం.. ధరలు భారీగా పెరగటం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల్లో బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు కొనుగోలు చేయటం సరికాదన్న భావనలో ప్రజలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. రానున్న ధన త్రయోదశి నాటికి పరిస్థితిలో మార్పు వస్తుందని బంగారు వ్యాపారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా.. అలాంటి పరిస్థితి ఉండదంటున్నారు. దీనికి కారణం.. కరోనా కేసులు ఇదే కాలానికి మరింత ఎక్కువగా నమోదవుతాయన్నది మర్చిపోకూడదంటున్నారు. బంగారం కొనుగోళ్లు తగ్గినా ధర మాత్రం కొండెక్కి కూర్చోవటం పదిగ్రాముల బంగారం రూ.52వేలు పలకటం కూడా ప్రజల్లో నిరాసక్తత వ్యక్తమవుతోందని చెబుతున్నారు. కరోనా ఒక కొలిక్కి వచ్చే వరకు ఇలాంటి పరిస్థితే కంటిన్యూ అవుతుందన్న మాట వినిపిస్తోంది.