Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: రైలు టికెట్ చేతికి రాదట!

By:  Tupaki Desk   |   24 July 2020 4:45 AM GMT
కరోనా ఎఫెక్ట్: రైలు టికెట్ చేతికి రాదట!
X
ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తోంది కరోనా మాయదారి. ఇప్పటివరకూ ఆలోచించని కొత్త అంశాల గురించి ఆలోచించాల్సిన అనివార్యతను తీసుకొచ్చింది. దీంతో.. ఎవరికి వారు తమకు సంబంధించిన వాటి విషయంలో కరోనా జాగ్రత్తలు ఏమేం తీసుకోవాలన్న విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మాయదారి రోగానికి చెక్ చెప్పాలంటే భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఇప్పటివరకూ స్టేషన్లలో రైళ్లలో ప్రయాణానికి టికెట్లను మంజూరు చేసేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై టికెట్లు ఇవ్వరని.. క్యూఆర్ కోడ్ తో విమాన టికెట్ల మాదిరి సెల్ ఫోన్ కే వస్తాయని చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు 85 శాతం మంది రిజర్వు టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి టికెట్లను నేరుగా ఇవ్వకుండా కాంటాక్ట్ లెస్ టికెట్లను ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకేయాదవ్ వెల్లడించారు. కౌంటర్లో టికెట్ కొనుగోలు చేసిన వెంటనే.. ప్రయాణికుడి మొబైల్ నెంబరుకు ఒక లింక్ వస్తుందని.. దాన్ని ప్రెస్ చేసినంతనే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుందని చెబుతున్నారు. ఇదే.. టికెట్లుగా చెలామణీ కానుంది. టికెట్లను చెక్ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. మొత్తంగా కరోనా రైల్వే టికెటింగ్ విధానాన్నే సమూలంగా మార్చేస్తుందని చెప్పక తప్పదు.