Begin typing your search above and press return to search.

కరోనాతో చనిపోతే శవం కోసం రెండు రోజులు వేచి చూడాలా?

By:  Tupaki Desk   |   23 July 2020 7:30 AM GMT
కరోనాతో చనిపోతే శవం కోసం రెండు రోజులు వేచి చూడాలా?
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. అలాగే కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. హైదరాబాద్ గాంధీ లో కరోనాతో చికిత్స పొందుతూ చనిపోతే, ఆ చావు కబురు బాధిత కుటుంబాలకు తెలిసే సమయానికి 24 గంటలు పైగా పడుతుంది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. తన తల్లి చనిపోయి 24 గంటలు గడిచినా కూడా ఇంకా శవాన్ని అప్పగించ లేదంటూ.. ఛాతీ హాస్పిటల్ లో వద్ద ఓ యువకుడు ఇటీవల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఓ సంఘటన అయితే మరీ దారుణం. ఓ వృద్ధుడు చనిపోయిన ఐదు రోజులు గడిచినా కూడా కరోనా రిపోర్టు రావడంలో ఆలస్యం కావడంతో బంధువులకు మృతదేహాన్ని అప్పగించ లేదు. ఆ రిపోర్ట్ వచ్చేలోగా బాడీ డీ కంపోస్‌ స్థితికి చేరింది. దీంతో బంధువులు వైద్యులు, పోలీసులకే అంత్యక్రియల బాధ్యత అప్పగించేశారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు చనిపోతే కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం తెలుస్తుంది. ఓ కరోనా బాధితుడు ఉదయం 7 గంటలకు చనిపోతే, వార్డులో విధులు నిర్వహిస్తున్న నర్సులు, సిబ్బందికే రెండు గంటల తర్వాత తెలుస్తోంది. చనిపోయాడా లేదా తెలుసుకోవడానికి ఈసీజీ తీస్తారు. ఆ రిపోర్ట్ ‌ రావడానికి మరో గంట , శవాన్ని మార్చురీకి తరలించేందుకు సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు. మార్చురీకి చేరుకోవడానికి మధ్యాహ్నం 12 అవుతుంది. ఆర్‌ ఎంఓ అధికారులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని ఫొటో తీస్తారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన పేషెంట్‌ డెత్‌ కన్ఫర్మేషన్‌ వాట్సాప్‌ గ్రూపులో మృతుడి ఫొటోతోపాటు వివరాలు పొందుపరచాలి.

ఆ గ్రూపులో జీహెచ్‌ ఎంసీ అధికారులు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు, గాంధీ ఆస్పత్రి వైద్యులు ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరికీ ఫోన్‌ చేసి తెలియజేయరు. అధికారులు ఎవరికి వారు గ్రూపులో వచ్చిన సమాచారాన్ని చూస్తూ నే ఉండాలి. సంబంధిత ఏరియా పోలీసులు ఆ సమాచారం చూడడంలో ఆలస్యమై, ఆ శవం అక్కడే ఉంటుంది. సమాచారం చూశాక ఓ కానిస్టేబుల్‌ మార్చురీకి వెళ్లి వివరాలు నిర్ధారించుకుంటా డు. సంబంధిత వ్యక్తి ఇంటికి సమాచారం పంపిస్తారు. ఇదంతా జరిగే సరికి కనీసం ఓ రోజు లేదా అంతకన్నా ఎక్కువ సమయ మే పడుతుందట. ఆ తర్వాత ఆ మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి ఫొటో ఆధారంగా మృతదేహాన్ని చూసి తమ మనిషిదే అని చెబితే.. ఆ మృతదేహానికి గ్రీన్‌ మార్కు చేసి మార్చురీలో భద్రత పరుస్తారు.

గాంధీ ఆస్పత్రిలో రోజుకు దాదాపు పది నుంచి 20 మంది మృత్యువాత పడుతున్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు లేదంటే ఎర్రగడ్డ శ్మశానవాటికకు తరలించేందుకు ఒక అంబులెన్స్‌ ఉండగా, అందులో కేవలం రెండు మృతదేహాలు మాత్రమే తీసుకెళ్లేందుకు అవకాశంఉంది. మిగతా వాటి కోసం ఆ అంబులెన్స్‌ వచ్చేంత వరకూ వేచి ఉండాల్సిందే. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు దాదాపు రెండు రోజులు పడుతోంది. అయితే, మృతదేహాలను నిర్ణీత సమయానికే అందజేస్తున్నాము అని , ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం.. అ న్ని చర్యలూ చేపట్టేందుకు కాస్త ఆలస్యం జరుగుతోంది అని డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌, ఎర్రగడ్డ ఛాతీవ్యాధులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ టీచెప్తున్నారు.